భలే రుచి.. భీమాళి మామిడి తాండ్ర

Special Story On Bheemali Mango Jelly - Sakshi

విజయనగరం జిల్లా భీమాళిలో సంప్రదాయంగా విలసిల్లుతున్న మామిడి తాండ్ర తయారీ 

400 కుటుంబాలకు అదే జీవనాధారం

తెలుగు ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల వారి మనసు దోచిన రుచులు

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఒక్కసారి కొరికితే.. నోటినిండా తియ్యటి తేనెలూరు తుంది. ఎంత తిన్నా జిహ్వ చాపల్యం తీరక.. ‘వదల భీమాళి.. నిన్నొదల’ అనాలని పిస్తుంది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం భీమాళి గ్రామస్తులు తయారు చేసే మామిడి తాండ్ర రుచి అలాంటిది మరి. వేసవి వచ్చిం దంటే చాలు. గ్రామంలో మామిడి తాండ్ర హడావుడి మొదలవుతుంది. ఇక్కడ తయారయ్యే తాండ్ర రుచులు తెలుగు ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల వారి మనసునూ దోచుకుంటున్నాయి. గ్రామంలో పూర్వీకుల నుంచి మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా వేళ్లూను కుంది. అప్పటి సంప్రదాయ రుచుల్ని నేటికీ ఆ గ్రామస్తులు నిలబెట్టుకుంటూ వస్తున్నారు. గ్రామంలో దాదాపు 400 కుటుంబాలకు అదే జీవనాధారం. ఏటా కనీసం లక్ష కేజీల మామిడి తాండ్ర ఈ ఒక్క గ్రామంలోనే తయారవు తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మామిడి తాండ్ర తయారీ ఉన్నప్పటికీ భీమాళి తాండ్రకు ప్రత్యేకత ఉండటంతో ఆదరణ లభిస్తోంది. 

తయారీ విధానమే ప్రత్యేకం
మామిడి తాండ్ర తయారీకి కండ ఎక్కువ ఉండే రకాలైన కలెక్టర్, కోలంగోవ, సువర్ణ రేఖ లాంటి రకాల మామిడి పండ్ల నుంచి గుజ్జు, రసం తీసి సమపాళ్లలో చక్కెర కలుపుతారు. వెదురు చాపలపై తాండ్రగుజ్జు వేసి ఎండబెడతారు. దానిపై రోజూ గుజ్జుతో కొత్త పొరలు వేస్తుంటారు. కావాల్సిన మందానికి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉంటారు. బాగా ఎండిన తర్వాత ముక్కలుగా కోస్తారు. ఒక్కో చాపకు 60 నుంచి 70 కేజీల మామిడి తాండ్ర తయారవుతుంది. పండ్ల నుంచి తీసిన టెంకలను పాతర వేసి.. మొలక వచ్చాక వర్షా కాలంలో అంట్లు కట్టి అమ్ముతుంటారు.
మామిడి పండ్ల నుంచి గుజ్జు తీస్తున్న మహిళలు 

జాగ్రత్త లేకుంటే నష్టం
తాండ్ర తయారీలో ఎలాంటి ఫుడ్‌ కలర్స్, రసాయనాలు వినియోగించరు. నిత్యం మ్యాంగోజెల్లీని ఎండబెట్టి, భద్రం చేయాలి. వాతావరణం చల్లగా ఉం టే  రంగు, రుచి మారే ప్రమాదం ఉంది. తాండ్ర రుచిగా ఉండాలన్నా, నిల్వ చేయాలన్నా ఎర్రటి ఎండలో ఎక్కువ కాలం ఎండబెట్టాలి. 

నిల్వ చేసే దారిలేదు
కోల్డ్‌ స్టోరేజీ లేకపోవడంతో మామిడి తాండ్రను నిల్వ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీనివల్ల దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. పెరిగిన కూలి ఖర్చులు, సరుకుల ధరలు, గిట్టుబాటు కాని అమ్మకపు ధరతో పరిశ్రమ కునారిల్లుతోంది. పేరు పడ్డ తాండ్ర తయారీకి రుణ సదుపాయం కల్పించాలని, అమ్మకపు పన్ను రద్దు చేయాలని, కుటీర పరిశ్రమగా గుర్తిం చాలని, స్థానికంగా శీతల గిడ్డంగులు నిర్మించాలని తయారీదారులు కోరుతున్నారు.

ఎండ ఉంటేనే పని
ఎండ ఎర్రగా కాస్తేనే తాండ్ర వేసేందుకు అవకాశం ఉంటుంది. ఏమాత్రం మేఘాలు పట్టినా తాండ్ర వేయలేం. ఎండలో ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదు.
–జి.సత్యవతి, తయారీదారు

కోల్డ్‌ స్టోరేజీ నిర్మించాలి
ఎండలో కష్టపడి తయారు చేసిన తాండ్రను కోల్డ్‌ స్టోరేజీ లేకపోవడంతో వెంటనే అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల మంచి ధర రావడం లేదు. విజయనగరంలోని కోల్డ్‌ స్టోరేజీకు తరలించి నిల్వ ఉంచితే వచ్చే లాభం కాస్తా దాని అద్దెకే సరిపోతోంది.
– ఎస్‌.రమణ, తయారీదారు

అమ్మకపు పన్ను రద్దుచేయాలి
కుటీర పరిశ్రమగా తయారు చేస్తున్న తాండ్రపై ప్రభుత్వం అమ్మకపు పన్ను రద్దు చేయాలి. అప్పుడే కొనుగోలుదారులు, వ్యాపారులు గ్రామానికి వస్తారు. తాండ్ర తయారీ దారులకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలి.
– మిడతాన అచ్చింనాయుడు, తయారీదారు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top