సంక్షేమ శేఖరుడు.. రాజన్న

Special Interest On Polavaram Development By YSR - Sakshi

మహానేతా..అందుకో మా జోత 

పశ్చిమ అభివృద్ధిపై ప్రత్యేక ముద్ర 

సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం 

పోలవరంతో డెల్టా సస్యశ్యామలం 

ఇప్పటికే కాఫర్‌ డ్యామ్‌ పనులు పూర్తి 

గిరిజనులకు భూప్రదాతగా నిలిచిన వైనం 

ఉద్యాన వర్సిటీతో పరిశోధనలకు ఊతం 

నేడు దివంగత వైఎస్సార్‌ జయంతి 

పోలవరం’ కోసం పరితపించారు.. డెల్టా ఆధునికీకరణకు నడుం బిగించారు.. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా జలయజ్ఞం చేపట్టారు.. ఉద్యాన వర్సిటీని స్థాపించి ఉద్యాన రైతులకు ఆసరాగా నిలిచారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుల విప్లవం తీసుకువచ్చారు.. ఆరోగ్యశ్రీ, 108లతో ప్రాణదాతగా నిలిచారు.. నీటిపారుదల, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ ‘పశ్చిమ’పై ఎనలేని ప్రేమను చూపించారు. అడుగడుగునా తన గురుతులతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి. గురువారం ఆయన జయంతి సందర్భంగా మహానేతా.. అందుకో మా జోత అంటూ పశ్చిమవాసులు నివాళులర్పిస్తున్నారు.  

సాక్షి ప్రతినిధి, ఏలూరు/బుట్టాయగూడెం: పశ్చిమగోదావరి సమృద్ధిగా ఉండాలి. అన్నదాతకు సాగు కష్టాలు తీరితేనే అంతా బాగుంటుంది. అవసరాలకు పూర్తిస్థాయిలో నీరు ఇవ్వగలితే అంతా చేసినట్టే ఇది దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నమ్మినమాట. దానిని ఆచరణలో పెట్టడంతో ‘పశ్చిమ’ ముఖ చిత్రం మారేలా జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి శాశ్వతంగా తన ముద్ర ఉండేలా మేలు చేశారు.  

  • రాష్ట్ర జీవనాడి పోలవరం కోసం వైఎస్సార్‌ పరితపించారు. అన్ని అనుమతులూ తీసుకువచ్చి కుడి, ఎడమ కాలువలకు సంబంధించి 80 శాతానికిపైగా పనులు పూర్తి చేయించారు. 
  • పోలవరం ప్రాజెక్టు పనులు ఈస్థాయిలో పరుగులు పెట్టడానికి వైఎస్సార్‌ చూపిన చొరవే కారణం.  
  • తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు ఆయన చలువతోనే రూపుదిద్దుకున్నాయి.  
  • ఏలూరుకు తమ్మిలేరు వరద నుంచి శాశ్వత పరిష్కారం చూపారు. 2005లో రూ.17 కోట్లతో మరమ్మతులకు నిధులు మంజూరు చేసి శాశ్వత ప్రాతిపదికన రూ.90 కోట్లతో తమ్మిలేరు కరకట్టను పరిపుష్టి చేశారు.  
  • ఏజెన్సీలోని కొండ కాలువలపై హైలెవెల్‌ బ్రిడ్జిని రూ.25 కోట్లతో అభివృద్ధి చేశారు. 
  • నరసాపురం వద్ద వశిష్ట వంతెన నిర్మాణానికి రూ.194 కోట్ల నిధులు మంజూరు చేసినా ఆయన మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ వంతెనను కలగా మిగిల్చాయి. 
  • జిల్లాకు అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకువచ్చి లేసుపార్కును అభివృద్ధి చేశారు. 
  • పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచిలి వద్ద గోదావరి ఏటిగట్టుకు రూ.20 కోట్లతో రివిట్‌మెంట్‌ నిర్మించడానికి చొరవ చూపడంతో ఆ ప్రాంత ప్రజలు ముంపు నుంచి బయటపడ్డారు.  
  • జిల్లాలో అర్హులైన పేదలకు 30 వేల ఎకరాలు భూ పంపిణీ చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. 
  • ఉచిత విద్యుత్‌ అందించడంతో పాటు ఒకే దఫాలో రైతులకు రుణమాఫీ చేసి రైతు బాంధవుడిగా నిలిచిపోయారు.

గిరిజనులకు పట్టాలు
జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ చిన్న, సన్నకారు రైతులకు సుమారు 30 వేల ఎకరాల పోడు భూములకు గాను వైఎస్సార్‌ పట్టాలిచ్చారు. గిరిజన ప్రాంతంలోని సుమారు 1,700 మంది గిరిజన పోడు భూమి రైతులకు 6,500 ఎకరాలకు పట్టాలను అందించడంతో పాటు భూములను సాగులోకి తీసుకువచ్చేలా బోర్లు వేయించి విద్యుత్‌ సదుపాయం కల్పించారు. 

ఉద్యాన’ వెలుగులు 
తాడేపల్లిగూడెంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారు. ఉద్యాన సాగు అభివృద్ధితో పాటు యువతకు విద్యావకాశాలు కల్పించేలా ఆయన తీసుకున్న చొరవ చిరస్మరణీయం. 

పోగొండ జలాలు
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పోగొండ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తికావడంలో వైఎస్సార్‌ చొరవ ఉంది. ప్రస్తుతం సుమారు 7,600 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందంటే అది ఆయన చలువే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top