
ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటుతో సంక్షేమ ఫలాలు
రాష్ట్రంలో 52 సంచార జాతుల కోసం ప్రత్యేక శ్రద్ధ
32 అత్యంత సంచార కులాలకు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు
విద్య, వైద్యం, సంక్షేమం దూరమైన వారికి భరోసా
కూటమి పాలనలో సంచార జాతుల బతుకు దుర్భరం
ఇచ్చిన హామీలు కూడా అమలు చేయని బాబు సర్కార్
రేపు విముక్త సంచార జాతుల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
సాక్షి, అమరావతి: ఉదర పోషణకు ఊరూరా సంచారం.. రోడ్డు పక్కన, మురికి కాల్వల గట్టున జీవనం.. ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులకు కూడా నోచుకోని దుర్భరం.. ఇది రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాక ముందు సంచార జాతుల జీవన చిత్రం. అటువంటి సంచార జాతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది.
అయితే కూటమి పాలనలో ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోని దారుణ పరిస్థితికి జారిపోయారు. ఈ నెల 31న విముక్త సంచార జాతుల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవన చిత్రానికి సంబంధించిన కథనం ఇది.
దుర్భర జీవనం...
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కళారూపాల ద్వారా పరిరక్షిస్తూ ధర్మప్రచారకులుగా ఊరూర తిరుగుతూ జీవనోపాధి పొందేవారిని సంచార జాతులుగా పరిగణించారు. కనీసం సొంత ఊరు, ఇల్లు, చిరునామా, కుల «ధృవీకరణ, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు లేక దశాబ్దాల తరబడి ప్రభుత్వ పథకాలకు కూడా నోచుకోని దుర్భర బతుకులు వారివి. పూసలు, దండలు, వనమూలికలు అమ్ముతూ, తలవెంట్రుకలు వంటివి కొంటూ, గొడుగులు బాగుచేస్తూ, సవరాలు అమ్ముతూ, చిత్తుకాగితాలు ఏరుకుంటూ, చిన్న చిన్న సర్కస్‌లు చేస్తూ, ఖాళీ సమయంలో భిక్షాటన చేస్తూ బతుకులు వెళ్లదీసే పరిస్థితి వారిది.
సంచార జాతుల స్వాతంత్య్రం– 1952
బ్రిటిష్ ప్రభుత్వం క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్, 1871 ద్వారా దాదాపు 500 కులాల వారికి ‘జన్మతః నేరస్తులు’ అనే ముద్ర వేసింది. ఈ చట్టం వల్ల వారు ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేసి జైలులో పెట్టేవారు. ఫలితంగా గౌరవంగా బ్రతకలేక, చాలా మంది రహస్యంగా సంచార జీవితం గడుపుతూ భిక్షాటనపై ఆధారపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ చట్టం రద్దు కాలేదు.
నిరంతర పోరాటాల తరువాత 1952 ఆగస్టు 31న ఈ కులాలను విముక్త జాతులుగా ప్రకటించారు. అందుకే సంచార జాతులు ఆ రోజును తమ నిజమైన స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయితే, వారి జీవనస్థితి మెరుగుపడేందుకు చేసిన కమిటీలు, కమిషన్ల సిఫార్సులు పరిమిత స్థాయిలో మాత్రమే అమలయ్యాయి.
సంక్షేమ ఫలాలు అందించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
రాష్ట్రంలో 52 సంచార జాతులకు చెందిన సుమారు రెండు లక్షల మంది ఉన్నారు. వారికి కుల ధృవీకరణ పత్రాలు, చిరునామా (నెటివిటి సర్టిఫికెట్)లు, ఆధార్, రేషన్‌కార్డులు జారీకి వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. వారిలో అనేకమందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. సంచార జాతుల పిల్లలకు చదువులను చేరువ చేసేలా అమ్మ ఒడిని వర్తింపజేశారు.
చేయూతతోపాటు నవరత్నాలతో అనేక సంక్షేమ పథకాల ద్వారా సంచార జాతులకు రూ.1,288.44కోట్లకుపైగా లబ్ది చేకూర్చడం విశేషం. వారిలో 32 సంచార జాతుల కోసం ప్రత్యేకంగా అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గుర్తింపు లేని తోలుబొమ్మలాటల కులస్తులను గుర్తించి బీసీ–బీ సీరియల్ నంబర్ 25లో చేర్పించారు.
హామీలను నెరవేర్చని కూటమి సర్కార్
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చని పరిస్థితి. ఎంబీసీలకు స్థానిక సంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్లు, దేవాలయాల పాలక మండలిలో సభ్యత్వం, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్సీ, మైనార్టీల మాదిరిగానే కో–అప్షన్ మెంబర్‌గా ఎంబీసీలకు అవకాశం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సంచార జాతుల గుర్తింపు కార్డుల మంజూరు... ఇలా ఏ ఒక్క హామీనీ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేస్తోంది.
జగన్ పాలనలో గుర్తింపు
జగన్ పాలనలోనే సంచార జాతులకు గుర్తింపు దక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిశలో చర్యలు తీసుకోవాలి. –పెండ్ర వీరన్న, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్