సవరించిన అంచనాకు ఓకే

Shekhawat directed authorities to address issues raised by CM Jagan - Sakshi

పోలవరానికి 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వాలన్న సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌

కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేశాక నిధులు విడుదల చేస్తామన్న కేంద్ర జల్‌శక్తి శాఖ 

విభాగాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు ఇవ్వడానికీ సానుకూలం

తమ భేటీలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రస్తావించిన అంశాలను పరిష్కరించాలని అధికారులకు కేంద్ర మంత్రి షెకావత్‌ ఆదేశం

దీంతో సాగునీటి ప్రాజెక్టుల అపరిష్కృత అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష 

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ (పెట్టుబడి అనుమతి) ఇచ్చేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ సోమవారం సానుకూలంగా స్పందించింది. సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి కొన్ని అంశాలపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) స్పష్టత ఇచ్చాక.. వాటిని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ దృష్టికి తీసుకెళ్లి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. నీటిపారుదల, నీటి సరఫరా వ్యయం వేర్వేరు కాదని, ఆ రెండూ ఒకటేనన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కేంద్ర జల్‌శక్తి శాఖ.. ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని విభాగాల (కాంపొనెంట్‌) వారీగా చూడకుండా.. రీయింబర్స్‌ చేయడంపైనా సానుకూలంగా స్పందించింది. గురువారం తమ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేవనెత్తిన అంశాలను పరిష్కరించాలని మంత్రి షెకావత్‌ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో సోమవారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) చైర్మన్‌ హెచ్‌కే హల్దార్, నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) డైరెక్టర్‌ జనరల్‌ భోపాల్‌సింగ్, సలహాదారు వెదిరె శ్రీరాం, పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులతో కూడిన బృందంతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

నిధులు ఇస్తే గడువు నాటికే పోలవరం పూర్తి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా కమిటీ) ఆమోదించిందని.. ఈ మొత్తానికి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇచ్చి.. నిధులు విడుదల చేస్తే నిర్దేశించుకున్న గడువు 2022 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని ఆదిత్యనాథ్‌ దాస్‌ కోరారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. ఈ వ్యయానికి సంబంధించి కొన్ని అంశాలపై పీపీఏ స్పష్టత కోరామని, ఆ వివరణ వచ్చాక మంత్రి షెకావత్‌ దృష్టికి తీసుకెళ్లి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇస్తామని చెప్పారు. కేంద్ర జల్‌ శక్తి శాఖ స్పష్టత కోరిన అంశాలపై వివరణ తక్షణమే పంపుతామని చంద్రశేఖర్‌ అయ్యర్‌ చెప్పారు. పీపీఏ నుంచి వివరణ వచ్చిన వెంటనే ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌పై నిర్ణయం తీసుకుంటామని ముఖర్జీ స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేస్తే సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరానికి నిధులు విడుదల చేస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ వాదనను బలపర్చిన సీడబ్ల్యూసీ
జాతీయ ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం.. నీటిపారుదల వ్యయం, నీటి సరఫరా వ్యయం వేర్వేరు కాదని.. రెండూ ఒకటేనని.. ఆ మేరకే  పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వాదనను సీడబ్ల్యూసీ చైర్మన్‌ హెచ్‌కే హల్దార్‌ బలపర్చారు. దాంతో.. ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల, సరఫరా విభాగాన్ని ఒకటిగానే పరిగణించి నిధులు విడుదల చేస్తామని దేబశ్రీ ముఖర్జీ స్పష్టం చేశారు. విభాగాలతో సంబంధం లేకుండా ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని వేగంగా రీయింబర్స్‌ చేయాలన్న జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు చేసిన సూచనపై ఆమె సానుకూలంగా స్పందించారు. 

మిగులు జలాలే లేనప్పుడు తరలింపు ఎలా సాధ్యం?
గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని.. తుది సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను పంపామని.. దాన్ని ఆమోదిస్తే కెన్‌–బెట్వా అనుసంధానం తరహాలో పనులు చేపడతామని ఎన్‌బ్ల్యూడీఏ డైరెక్టర్‌ జనరల్‌ భోపాల్‌ సింగ్‌ ప్రతిపాదించారు. దీనిపై రాష్ట్ర అధికారులు స్పందిస్తూ.. గోదావరిలో మిగులు జలాలే లేవని.. అలాంటప్పుడు 247 టీఎంసీలను తరలించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఈ వాదనతో హెచ్‌కే హల్దార్‌ కూడా ఏకీభవించారు. గోదావరిలో మిగులు జలాలు లేవని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సలహాదారు వెదిరె శ్రీరాం స్పందిస్తూ.. ఛత్తీస్‌గఢ్‌ కోటాలో వాడుకోని 176 టీఎంసీలు (5 వేల మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు), ఇచ్చంపల్లి వద్ద 71 టీఎంసీల మిగులు జలాలు (రెండు వేల మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు)ను కలిపి ఈ అనుసంధానానికి తరలించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిందన్నారు. ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి రాష్ట్ర అవసరాలు తీర్చాక గోదావరి మిగులు జలాలను కావేరీకి తరలిస్తే అభ్యంతరం లేదని రాష్ట్ర అధికారులు చెప్పారు. పోలవరం నుంచి నీటిని తరలించాలంటే ఎక్కువ ఎత్తుకు నీటిని ఎత్తిపోయాలని.. ఇచ్చంపల్లి నుంచి తక్కువ ఎత్తుకు నీటిని ఎత్తిపోయవచ్చని, దీనికి తక్కువ వ్యయం అవుతుందని.. వీటిపై  అధ్యయనం చేసి అభిప్రాయం చెబుతామని భోపాల్‌సింగ్‌ తెలిపారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top