స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
అనూహ్యంగా పెరిగిన వడగాడ్పులు ∙
రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృతి
తణుకులో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
ఉక్కపోతలతో అల్లాడిపోతున్న జనం
సాక్షి, అమరావతి: ఉక్కపోతలతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గడచిన రెండురోజులతో పోల్చితే శుక్రవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినా వడగాడ్పులు మాత్రం అనూహ్యంగా పెరగడంతో 15 మంది ప్రాణాలు విడిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 14 మంది, గుంటూరు జిల్లా తుళ్లూరులో ఒకరు మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అత్యధికంగా 44.8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది.
15 జిల్లాల పరిధిలోని 67 మండలాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 150 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది.
నేడు వడగాడ్పుల ప్రభావం చూపే జిల్లాలివే
శనివారం పోలవరం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.


