భద్రం బ్రదర్‌.. సీవోడీనే బెటర్‌ | Sakshi
Sakshi News home page

భద్రం బ్రదర్‌.. సీవోడీనే బెటర్‌

Published Sun, Feb 5 2023 6:11 AM

Scams on rise in name of e-commerce companies - Sakshi

మహేశ్వరి అనే మహిళ ఈ–కామర్స్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేసింది. డెలివరీ తీసుకున్న తరువాత తెరిచి చూస్తే ఆమె ఆర్డర్‌ పెట్టిన కంపెనీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కాకుండా వేరే సాఫ్ట్‌వేర్‌తో ఉన్న నకిలీ ల్యాప్‌టాప్‌ వచ్చినట్టు గ్రహించింది. ఈ–కామర్స్‌ కంపెనీ కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌కు ఫిర్యాదు చేస్తే ఏడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. కానీ.. పట్టించుకోలేదు. కంపెనీ కార్యాలయానికి వెళితే ఆమె ఫిర్యాదును పరిష్కరించే బాధ్యులెవరూ కనిపించలేదు. చేసేది లేక అదనంగా సొమ్ము చెల్లించి ఆ ల్యాప్‌టాప్‌లోనే తనకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఇలా ఎంతోమంది.. ఎన్నో విధాలుగా మోసపోతున్నారు.
 – సాక్షి, అమరావతి

ఆన్‌లైన్‌ షాపింగ్‌ మారుమూల పల్లెలకూ అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తే కొన్ని సందర్భాల్లో తాము ఆర్డర్‌ చేసిన వస్తువుకు బదులుగా వేరొకటి రావడం.. వస్తువును రిఫండ్‌ చేస్తే డబ్బులు తిరిగి రాకపోవడం వంటి మోసాలు పెరు­­గు­తున్నాయి. నగదు చెల్లించినా వస్తువు రాకపోవడం.. క్రెడిట్, డెబిట్‌ కార్డులను తస్కరించి వేరొ­కరు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడం వంటి మోసాలెన్నో జరుగుతున్నాయి.

ఇలా మోసపోతున్న వారికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. మన దేశంలో ఈ–కామర్స్‌ వ్యాపారంపై నిర్దిష్ట నిబంధనలు లేవు. కానీ.. వినియోగదారుల రక్షణ చట్టం–1986, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సవరణ చట్టం 2008, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మొదలైన నియంత్రణ సంస్థలచే నిర్దేశించిన విధానాలు ఈ–కామర్స్‌ సంస్థల­కు కూడా వర్తిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఎవరికి ఫిర్యాదు చేయాలంటే..
ఈ–కామర్స్‌ సంస్థల చేతిలో ఎవరైనా మోసపోతే.. ‘కన్సూమర్‌ కోర్ట్‌ ఆన్‌లైన్‌ ఇండియా’, కన్సూమర్‌ ఫోరమ్, కమిషన్‌లలో ఫిర్యాదు చేయొచ్చు. వీటికి వెబ్‌సైట్, యాప్, టీవీ షాపింగ్‌ షో ద్వారా ఆర్డర్‌ చేసి రిఫండ్‌ లేదా రీప్లేస్‌మెంట్‌ పొందకపోవడం, ఆలస్యంగా డెలివరీ చేయడం, తప్పుదారి పట్టించే ప్రమోషన్ల వంటి వాటిపై పైన పేర్కొన్న సంస్థలకు ఫిర్యాదు చేయవచ్చు.

వినియోగదారుడు ఫిర్యాదు చేయడానికి ముందు ఈ–కామర్స్‌ కంపెనీ కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు కాల్‌ చేయాలి. ప్రతి ఈ–కామర్స్‌ కంపెనీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం నిర్దేశించిన విధంగా ఫిర్యాదు అధికారిని అందుబాటులో ఉంచాలి. ఆ వివరాలు కంపెనీ వెబ్‌సైట్‌లో ఉండాలి. మీ ఫిర్యాదును సదరు అధికారికి తెలియజేయండి.

కొన్ని ఈ–కామర్స్‌ కంపెనీలు మధ్యవర్తిత్వ విధానాన్ని అనుసరిస్తాయి. అది సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇలా చేసినా ప్రయోజనం లేకపోతే డీలర్, తయారీదారు, సర్వీస్‌ ప్రొవైడర్‌ పేర్లు, చిరునామాలను సేకరించండి. ఆ చిరునామాలకు సమస్యను రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా రాసి పంపండి.

గడువు ముగిసిన తర్వాత మీకు ఎలాంటి స్పందన రాకపోతే వినియోగదారుల ఫోరమ్, కమిషన్‌ను ఆశ్రయించండి. 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ–కామర్స్‌ వినియోగదారులు తమ సొంత నగరంలోని వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు.

‘సైబర్‌’ భద్రత ఇలా..
ఇటీవల రోగ్‌ (నకిలీ) వెబ్‌సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కాపీరైట్‌ ఉల్లంఘనకు పాల్పడటం ద్వారా తప్పుడు వివరాలతో నకిలీ ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లు వినియోగదారులను మోసగిస్తున్నాయి. వీటిని గుర్తించి నిషేధించినా మరో పేరుతో మళ్లీ వస్తున్నాయి. వాటిని తెరిస్తే మనకు తెలియకుండానే మన కార్డుల్లో నగదు ఖర్చవుతుంటుంది. ఇలాంటి నకిలీ, పైరసీ వంటి నేరాల బారినపడిన బాధితులు 24 గంటల్లోపు ‘నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌’లో ఫిర్యాదు చేయాలి.

సంబంధిత అధికారులు ఐపీ చిరునామా ఆధారంగా సైబర్‌ మోసగాళ్లను కనిపెడతారు. నకిలీలను ప్రోత్సహించే డొమైన్‌పై నేషనల్‌ ఇంటర్నెట్‌ ఎక్సే్చంజ్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకుకు వెళ్లి అనధికార లావాదేవీలపై ఫిర్యాదు చేయడం ద్వారా కార్డును బ్లాక్‌ చేసి, నగదును తిరిగి పొందవచ్చు. అన్నిటికంటే ముందు ఈ–కామర్స్‌ సైట్‌ అడ్రస్‌ను ప్రభుత్వం అందిస్తున్న రిజస్ట్రీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో వెతికితే అది అసలైనదో, నకిలీదో తెలిసిపోతుంది.

సురక్షిత ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసం..
► తెలియని ఈ–కామర్స్‌ కంపెనీల నుంచి కొనుగోలు చేయడానికి ముందు వాటిని పరిశోధించండి. అనుమానం ఉంటే కొనుగోలును ఆపేయాలి.
► మొదటిసారి సైట్‌ నుంచి కొనుగోలు చేస్తుంటే క్యాష్‌ ఆన్‌ డెలివరీని ఎంచుకోండి.
► కొనుగోలు చేయడానికి ముందు నిబంధనలు, గోప్యతా విధానాన్ని చదవండి. 
► డెబిట్, క్రెడిట్‌ కార్డ్‌ నంబర్‌ థర్డ్‌ పార్టీతో షేర్‌ చేస్తున్నారా లేదా అనే వివరాలు తెలుసుకోండి.
► ఆర్డర్‌ రద్దు, వాపసు విధానాలను, నియమాలను చదివి అర్థం చేసుకోండి.
► ఈ–కామర్స్‌ కంపెనీ చిరునామా, ఈ–మెయిల్, ఫోన్‌ నంబర్, హెల్ప్‌లైన్‌ వంటి కస్టమర్‌ కేర్‌ వివరాలు వాస్తవమో కాదో 
నిర్ధారించుకోండి.
► ఉత్పత్తి, వారంటీ వివరాలు తెలుసుకోవడానికి అవసరమైన మెటీరియల్‌ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేయండి.
► నగదు చెల్లించడానికి ముందు, ఆ వస్తువును కంపెనీ మీ పిన్‌కోడ్‌కు డెలివరీ చేస్తుందో లేదో చూసుకోండి.
► ఒకవేళ కంపెనీ ధర, వస్తువు వివరణను ఆర్డర్‌ చేసిన తర్వాత మార్చవచ్చు. కాబట్టి కొనుగోలు చేసిన వెంటనే ఆర్డర్‌ వివరాలు స్క్రీన్‌షాట్‌ తీసుకోండి.
► ఎక్స్చేంజ్‌ , రిఫండ్‌ వంటి క్లెయిమ్‌ల విషయంలో జాగ్రత్త వహించండి. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం వస్తువు లోపభూయిష్టంగా ఉంటే కంపెనీలు ఎక్సే్చంజ్,  రిఫండ్‌ చేయాలి.  

Advertisement
Advertisement