రీమోడల్‌ ప్రయోగం సక్సెస్‌

RTC bus Remodel Experiment Success in Andhra Pradesh - Sakshi

ఆర్టీసీ బస్సును ఎలక్ట్రిక్‌ బస్సుగా మార్పు 

2 గంటల చార్జింగ్‌తో 200 కి.మీ. ప్రయాణం 

గంటకు 80 కి.మీల వేగం ఆటోమేటిక్‌ గేర్‌ సిస్టం 

పొగ రాదు.. వాయు కాలుష్యం ఉండదు 

ఆర్టీసీకి తగ్గనున్న డీజిల్‌ భారం 

త్వరలోనే రోడ్డుపైకి తొలి బస్సు

చిత్తూరు రూరల్‌: ఆర్టీసీ బస్సు రీ మోడల్‌ ప్రయోగం ఫలించింది. చిత్తూరు–2 డిపోకు చెందిన బస్సును ఎలక్ట్రిక్‌ బస్సుగా మార్పు చేశారు. ఇందుకు రూ.72 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. 2 గంటలు చార్జింగ్‌ చేస్తే 200 కిలోమీటర్ల వరకు పరుగులు పెట్టనుంది. డీజిల్‌ భారం ఆర్టీసీకి పెద్ద తలనొప్పిగా మారింది.ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

ఎలక్ట్రిక్‌ బస్సుగా మార్పు చేయాలని భావించి.. రెండేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని వీర వాహన ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు ఈ బాధ్యతను అప్పగించింది.  అన్ని పనులు పూర్తయ్యాక విజయవాడకు చెందిన ఆర్టీసీ టీమ్‌ ఆ ఎలక్ట్రిక్‌ బస్సును పరీక్షించింది. అనంతరం బస్సును చిత్తూరు–2 డిపోకు తీసుకొచ్చారు. 

బస్సు ప్రత్యేకతలు ఇవే... 
చిత్తూరు–2 డిపో గ్యారేజీకి గత వారం ఈ బస్సు చేరింది. ఇందులో ఆరు హెవీ డ్యూటీ బ్యాటరీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ బ్యాటరీల చార్జింగ్‌కు 1.30 నుంచి 2 గంటల సమయం తీసుకుంటుంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 180 నుంచి 200 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఈ బస్సు గేర్‌ సహాయం లేకుండా స్విచ్‌ టైప్‌తో ఆటోమెటిక్‌గా నడుస్తుంది. గంటకు 80 కి.మీ వేగంతో నడిచేలా తీర్చిదిద్దారు.

ఎలక్ట్రిక్‌ మోటార్‌తో చక్కటి స్టీరింగ్‌ను ఏర్పాటు చేశారు. పాత పద్ధతిలో బ్రేక్‌ సిస్టం, డ్రైవర్‌కు సౌకర్యార్థంగా డాష్‌బోర్డును బిగించారు. దీని ద్వారా బ్యాటరీ పరిస్థితి, బస్సు ఏ గేర్‌లో వెళుతోంది.. అనే విషయాలను తెలుసుకునే వీలుంది. ఇక బస్సు కింద భాగంలో అమర్చిన పరికరాలు వర్షానికి తడవకుండా అల్యూమినియంతో పూర్తిగా కప్పేశారు. 

తిరుపతి–తిరుమల మార్గంలో.. 
కొత్తగా రూపుదిద్దుకున్న ఎలక్ట్రిక్‌ బస్సును తిరుపతి–తిరుమల మార్గంలో తిప్పనున్నారు. ఈ క్రమంలో అలిపిరి వద్ద చార్జింగ్‌ స్టేషన్‌ పనులు జరుగుతున్నాయి. అలాగే తిరుపతి బస్టాండులో కూడా ఒక చార్జింగ్‌ పాయింట్‌ పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పరీక్షలు పూర్తయిన తరువాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బండిని రోడ్డుపైకి తీసుకొస్తారని సమాచారం. 

డ్రైవర్‌కు అనుకూలమైన బస్సు. గేర్లు లేకుండా నడపవచ్చు. బ్యాటరీ, మోటార్‌ సాయంతో వెళుతుంది. ఈ బస్సుతో డీజిల్‌ భారం తగ్గనుంది. పొగ రాదు.. వాయు కాలుష్యం ఉండదు. 
– ఇబ్రహీం, డిప్యూటీ సీఎంఈ, చిత్తూరు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top