కృష్ణా జిల్లా బంటుమిల్లి–గుడివాడ రోడ్డులో వంతెన వద్ద బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్
బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి
మృతులిద్దరూ అక్కచెల్లెళ్ల కొడుకులు
బంటుమిల్లి మండలం చినతుమ్మిడిలో తీవ్ర విషాదం
బంటుమిల్లి: కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలోని బంటుమిల్లి–గుడివాడ రోడ్డులో పెదతుమ్మిడి మీడియం డ్రెయిన్ వంతెన వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మండలంలోని చినతుమ్మిడి గ్రామానికి చెందిన అక్కచెల్లెళ్ల కొడుకులు వేముల శివయ్య(30), కాగిత అమలేశ్వరరావు(30) ద్విచక్రవాహనంపై వేకువజామున ఆదివారం మార్కెట్‌కు బయలుదేరారు. బంటుమిల్లి వైపు వంతెన దాటిన కొద్ది అడుగుల దూరంలోనే ఎదురుగా వేగంగా వస్తున్న వ్యాన్ వీరి బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో బైక్‌పై ఉన్న శివయ్య, అమలేశ్వరరావు డ్రెయిన్‌లో పడిపోయారు.
బైక్ పూర్తిగా ధ్వంసం కాగా, వ్యాన్ కూడా డ్రెయిన్‌లో పడిపోయింది. ప్రమాదంలో శివయ్య అక్కడికక్కడే మరణించగా, అమలేశ్వరరావును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దిశమర్రులో చెరువుల వద్ద మేత కట్టలు దించి హనుమాన్ జంక్షన్ వెళ్తున్న వ్యాన్ డ్రైవరు బాలిన సుబ్బారావు మద్యం, నిద్రమత్తులో రాంగ్ రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొట్టాడని స్థానికులు తెలిపారు. అక్కడే ఉన్న కొందరు ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు శివయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది.
చినతుమ్మిడిలో విషాదం
ఈ ఘటన చినతుమ్మిడిలో విషాదం నింపింది. మృతులిద్దరూ అక్కాచెల్లెళ్ల కుమారులు కావడంతో రెండు కుటుంబాల వారి రోదనలు మిన్నంటాయి. డ్రెయిన్ వంతెన వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి ఆర్‌అండ్‌బీ అధికారులే బాధ్యత వహించాలని స్థానికులు ఆరోపించారు.


