రేపటి నుంచి విగ్రహాల పునఃప్రతిష్ట సన్నాహక పనులు

Renovation Work Of The Ramateertham Temple Statues From 18th Jan - Sakshi

రామతీర్థం ఆలయంలో ప్రత్యేక హోమం తర్వాత పనులు ప్రారంభం 

23 నాటికి విగ్రహాల తయారీ పూర్తి

సాక్షి, అమరావతి: రామతీర్థం శ్రీరామస్వామి వారి ఆలయంలో విగ్రహాల పునః ప్రతిష్ట సన్నాహక కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విగ్రహ పునఃప్రతిష్టతో పాటే ఆగమ పండితుల సలహాలతో పురాతన ఆలయాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పునః ప్రతిష్టకు ముందు చేపట్టాల్సిన పనులు ప్రారంభించేందుకు దేవదాయ శాఖ అధికారులు సోమవారం ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించనున్నారు. హోమం అనంతరం సంప్రదాయ బద్ధంగా ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బాలాలయంలో ఉంచుతారు. ఆలయంలోని గర్భాలయం పాతకాలపు కట్టడం అయినా ఇప్పటికీ పటిష్టంగా ఉండడంతో గర్భాలయ గోడలను అలానే ఉంచుతూ.. లోపలి భాగాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది.

గర్భాలయం ముందు భాగాన ఉన్న మండపం, భక్తులు ప్రదక్షిణ చేసే ప్రాకారం వంటి వాటిని కూడా పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలని నిర్ణయించింది.  కొండపై ఉన్న ఆలయం వద్ద ఏ పనులు చేపట్టాలన్నా తగిన స్థాయిలో నీటిని అందుబాటులో ఉంచేందుకు యుద్ధప్రాతిపదికన కొండపై నీటి ట్యాంకును కూడా దేవదాయ శాఖ ఏర్పాటు చేయనుంది. కొండపై ఆలయం వద్దకు భక్తులు సులభంగా వచ్చి వెళ్లేందుకు వీలుగా మెట్ల మార్గాన్ని కూడా విస్తరిస్తారు. కొండపై ఆలయాన్ని ఆనుకుని ఉన్న కోనేరును కూడా ఆధునికీకరిస్తారు. ఇదిలా ఉండగా, రామతీర్థం ఆలయంలో పునః ప్రతిష్టించేందుకు శ్రీరాముడి మూలవిరాట్‌ విగ్రహంతో పాటు సీతమ్మ, లక్ష్మణుడి విగ్రహాలను టీటీడీ శిల్పులు ఈ నెల 23 నాటికి సిద్ధం చేస్తారు. ఆయా కార్యక్రమాల పర్యవేక్షణకు దేవదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ భ్రమరాంబను ప్రత్యేకాధికారిగా నియమించారు. 

ఆలయ ఆధునికీకరణపై రేపు మంత్రి సమీక్ష
శ్రీరామస్వామి గర్భాలయాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మించాలని ఒకరిద్దరు స్వామీజీలు దేవదాయ శాఖకు సూచన చేసినట్టు తెలిసింది. ఆ సూచనలను ఇతర ఆగమ పండితుల దృష్టికి తీసుకెళ్లే విషయమై దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సోమవారం శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top