ఐఐటీ, ఎన్‌ఐటీ అభ్యర్థులకు ఊరట

Relaxation of regulations in national educational institutions like IIT and NIT in the wake of Covid-19 - Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో నిబంధనల సడలింపు

జేఈఈ అడ్వాన్స్, మెయిన్‌ అర్హతతో ప్రవేశాలు

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన నిబంధనల నుంచి అభ్యర్థులకు ఈసారి కొంత ఊరట లభిస్తోంది. ఈ సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియలో పాల్గొనాలంటే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించడంతో పాటు ఇంటర్మీడియెట్‌లో 75 % మార్కులు లేదా జేఈఈలో టాప్‌ 20 పర్సంటైల్‌ సాధించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు ఈ నిబంధన నుంచి కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చింది.

కోవిడ్‌ నేపథ్యంలో మినహాయింపు
► కోవిడ్‌–19 నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థులు కూడా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
► దీంతో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తూ.. జేఈఈలో అర్హత సాధించి మెరిట్‌లో ఉన్న అభ్యర్థులకు ఆయా సంస్థల్లో సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. 
► ఐఐటీల్లో సీట్లకు జేఈఈ అడ్వాన్స్‌లో.. ఇతర సంస్థల్లో సీట్లు పొందేందుకు జేఈఈ మెయిన్‌లో మెరిట్‌ సాధించి ఉండాలి. 
► ఈసారి కోవిడ్‌ కారణంగా అభ్యర్థులు ఆయా సంస్థల్లో చేరేందుకు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్‌ చేయవచ్చు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మాత్రం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 

వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు
► జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష 27న జరగనున్న నేపథ్యంలో ఐఐటీ న్యూఢిల్లీ సోమవారం నుంచి అడ్మిట్‌ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 
► అడ్మిట్‌ కార్డులో అభ్యర్థి పేరు, రోల్‌ నంబర్, ఫొటో, సంతకం, పుట్టిన తేదీ, చిరునామా, సామాజిక వర్గం సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.
► ఈ ఏడాది మొత్తం 2.50 లక్షల మంది అర్హత సాధించినా కేవలం 1,60,864 మందే పరీక్షకు హాజరయ్యేందుకు నమోదు చేసుకున్నారు. 

222 నగరాల్లోని 1,150 కేంద్రాల్లో...
► ఫలితాలు అక్టోబర్‌ 5న విడుదలవుతాయి. అక్టోబర్‌ 6 నుంచి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించనుంది. 
► ఈసారి కౌన్సెలింగ్‌ ప్రక్రియను 7కు బదులు 6 విడతల్లోనే ముగిస్తారు. అభ్యర్థులకు అవగాహన కోసం 2 విడతల మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.
► ఐఐటీలతో పాటుగా జేఈఈ అడ్వాన్స్‌ ర్యాంక్‌తో బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, బర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలి, పూనే, తిరువనంతపురం, తిరుపతిలలో ఉన్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
► తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, రాయబరేలీలోని రాజీవ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ, విశాఖలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం సంస్థల్లో ప్రవేశాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top