వచ్చే 3 రోజులు అక్కడక్కడా వర్షాలు
సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో శనివారం 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.1 డిగ్రీలు, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 40.9, చిత్తూరు జిల్లా నగరిలో 40.4, పార్వతీపురం జిల్లా వీరఘట్టంలో 40.3, విజయనగరం జిల్లా గుర్లలో 40.1, పల్నాడు జిల్లా గురజాల 39.8, నంద్యాల జిల్లా గుల్లదుర్తి, కర్నూలు జిల్లా తోవిలో 39.7 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, బుర్జ, హిర మండలం, జలుమూరు, లక్ష్మీనర్సంపేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలు, విజయనగరం జిల్లా గుర్ల, సంతకవిటి మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాలు, పోలవరం జిల్లా గంగవరం, కూనవరం మండలాలు, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండడంతో సోమవారం నుంచి 3 రోజులపాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


