
వేలాదిగా తరలివచ్చిన లబ్ధిదారులు
ఆందోళనతో అట్టుడికిన కలెక్టరేట్
ఆర్డీటీ సేవలను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం
అనంతపురం అర్బన్: ‘సేవ్ ఆర్డీటీ’ నినాదంతో ఎస్సీ, ఎస్టీ అఖిలపక్ష కమిటీ సోమవారం నిర్వహించిన ‘పొలికేక’ కార్యక్రమంతో అనంతపురం కలెక్టరేట్ ప్రాంతం హోరెత్తింది. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి వేలాది మంది ఆర్డీటీ లబ్ధిదారులు ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ చేపట్టిన ఆందోళనతో ఆ ప్రాంతమంతా అట్టుడికింది. కలెక్టరేట్‌లోకి నాయకులు, లబ్ధిదారులు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్ గేటుకు అడ్డుగా ఉంచిన బారికేడ్లను లబ్ధిదారులు నెట్టివేశారు. కొందరు గేట్లు ఎక్కి కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లారు. మరికొందరు కలెక్టరేట్ గేటుపై నిలబడి ‘సేవ్ ఆర్డీటీ’ అంటూ నినదించారు.
ఆర్డీటీ ఒక కులానికి.. ఒక మతానికి పరిమితం కాదు..
పోలికేక కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ అఖిలపక్ష కమిటీ నాయకులు బీసీఆర్ దాస్, నెరమెట్ల ఎల్లన్న, దాసగాని కుళ్లాయప్ప, రాజగోపాల్, రాజారాం(నరేంద్ర), డీవీఎంసీ చిరంజీవి, అక్కులప్ప, సాకే హరి, నాగేష్ తదితరులు మాటê్లడారు. ఆర్డీటీ ఒక మతానికో, ఒక కులానికో పరిమితం కాదని వారు స్పష్టంచేశారు. ఆర్డీటీ సేవలు పేదలకు అందకుండా చేయడానికి ఉన్నత స్థాయిలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులరైజేషన్ యాక్ట్(ఎఫ్‌సీఆర్‌ఏ) లైసెన్స్ రెన్యూవల్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని మార్గాల్లో విన్నవించినా స్పందన లేదన్నారు.
ఆర్డీటీ సేవలు కొనసాగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ప్రయోజనం కనిపించలేదన్నారు. దీన్నిబట్టి చూస్తే పేదలకు ఆర్డీటీని దూరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని అర్థమవుతోందన్నారు. ప్రస్తుతం తాము చేపట్టిన ఆందోళన ఒక నమూనా మాత్రమే అని, ఆర్డీటీ సంస్థను రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళతామaని స్పష్టంచేశారు.
ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రెన్యూవల్ చేయకపోతే ఢిల్లీలోనే ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్‌వో మలోలకు వినతిపత్రం అందజేసి తమ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కాగా, ‘పొలికేక’తో కలెక్టరేట్ పరిసరాలు పూర్తిగా జనసందోహంతో నిండిపోయాయి. కలెక్టరేట్ ఎదురుగా రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ధర్మవరం, కదిరి, పెనుకొండ, బెంగళూరు వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో, వాటిని దారి మళ్లించారు.