
కోటి సంతకాల సేకరణ పోస్టర్‌ను ఆవిష్కరించిన సజ్జల
నేటి నుంచి 45 రోజులు విస్తృత కార్యక్రమం
సాక్షి, అమరావతి: పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని, వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుడితే, ప్రైవేటీకరణ ద్వారా వాటిని సీఎం చంద్రబాబు పేదలకు దూరం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమం పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ, ‘‘ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి 175 నియోజకవర్గాల్లో శుక్రవారం నుంచి వైఎస్సార్‌సీపీ 45 రోజుల పాటు గ్రామ స్థాయి వరకూ ప్రజా ఉద్యమం చేపడుతుంది. సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నుంచి రచ్చబండ కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండలో నాయకులు పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పిస్తారు.
అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టి సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమరి్పస్తారు. నవంబర్ 23న జిల్లా కేంద్రాల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. నవంబర్ 24న ఈ పత్రాలు కేంద్ర కార్యాలయానికి చేరుకుంటాయి. అనంతరం పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్ కు కోటి సంతకాలను సమర్పిస్తాం. పార్టీ మాత్రమే కాకుండా, పౌరసమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న మేధావి వర్గాలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొనాలని కోరుతున్నాం’’అని పిలుపునిచ్చారు.
ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేయడాన్ని చూస్తే, చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు తారస్థాయికి చేరాయని అర్థం అవుతోందని సజ్జల అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి , ఎనీ్టఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, పలువురువైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.
13న నకిలీ మద్యంపై నిరసన కార్యక్రమాలు
నకిలీ మద్యంపై సోమవారం (13వ తేదీ) అన్ని నియోజకవర్గాల్లో ఎక్సైజ్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు సజ్జల పిలుపునిచ్చారు. నకిలీ మద్యంపై ఇప్పటికే మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్య నాయకులతో గురువారం సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల విజయవంతంతోపాటు, పార్టీ కమిటీల నియామకంపై ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు.