ప్రజారోగ్యానికి వైఎస్‌ జగన్‌ పాలనలో పెద్దపీట | public health services good under Jagan govt: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యానికి వైఎస్‌ జగన్‌ పాలనలో పెద్దపీట

May 30 2026 5:55 AM | Updated on May 30 2026 5:55 AM

public health services good under Jagan govt: Andhra pradesh

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6 వెల్లడి

జాతీయ సగటును మించిన ఏపీ

అక్షరాస్యత, సాంకేతికత వినియోగంలో అభివృద్ధి

ఆస్పత్రి ప్రసవాలు, వ్యాక్సినేషన్‌లోనూ రికార్డే

బ్యాంకింగ్‌లోనూ మహిళలు ముందంజ

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్‌ జగన్‌ పాలనలో 2023–24లో ఆంధ్రప్రదేశ్‌ పలు కీలక సామాజిక, ఆరోగ్య సూచీలలో జాతీయ సగటును దాటి ముందంజలో నిలిచింది. 2019–21 సర్వే ఫలితాలతో పోల్చి చూస్తే, మరింతగా ప్రజారోగ్యానికి అప్పటి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు స్పష్టమైంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–6) 2023–24 నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2023–24లో రాష్ట్రంలో ప్రజారోగ్యం, మౌలిక వసతులు, మహిళా సాధికారత రంగాలలో విప్లవాత్మక మార్పులు నమోదయ్యాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యతను జాతీయ సర్వే చాటి చెప్పింది.

 రాష్ట్రంలో మహిళల విద్య, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఊహించని రీతిలో పురోగతి కనిపించినట్లు నివేదిక పేర్కొంది. పదవ తరగతి, అంతకంటే ఎక్కువ చదువుకున్న మహిళల సంఖ్య రాష్ట్రంలో 2019–21లో 39.6 శాతం ఉండగా, 2023–24 నాటికి అది 48.4 శాతానికి పెరిగి, జాతీయ సగటు 46.4 శాతాన్ని అధిగవిుంచడం గమనార్హం. అదే సమయంలో మహిళలు ఇంటర్నెట్‌ వినియోగంలోనూ ముందంజలో ఉన్నారు. సాంకేతిక వినియోగంలో మహిళలు దేశ సగటుకు సమానంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2019–21లో కేవలం 21 శాతంగా ఉన్న ఇంటర్నెట్‌ వాడుక, 2023–24 నాటికి ఏకంగా 63.6 శాతానికి చేరడం విశేషం.

తల్లీ పిల్లల ఆరోగ్యం దేశానికే ఆదర్శం
గర్భిణిలు, బాలింతల సంరక్షణ, శిశు ఆరోగ్య రక్షణలో ఏపీ జాతీయ సగటును మించి అద్భుతమైన పనితీరు కనబరిచినట్లు సర్వే వెల్లడించింది. గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లోనే వైద్య పరీక్షలు చేయించుకున్న తల్లుల సంఖ్య రాష్ట్రంలో 81.7 శాతం నుండి 88.6 శాతానికి పెరిగింది. ఇది జాతీయ సగటు 76.2 శాతం కంటే చాలా ఎక్కువ. రాష్ట్రంలో ప్రసవాలు ఆసుపత్రుల్లోనే (ఇన్‌స్టిట్యూషనల్‌ బర్త్స్‌) జరిగేలా చూడటంలో రికార్డు నమోదైనట్లు సర్వే పేర్కొంది. 2019–21లో 96.5 శాతం ఉన్న ఆసుపత్రి ప్రసవాలు.. 2023–24 నాటికి 98.4 శాతానికి చేరి, జాతీయ సగటు 90.6 శాతాన్ని మించాయి. 12–23 నెలల వయసున్నపిల్లల్లో సంపూర్ణ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ రాష్ట్రంలో 2019–21లో 73.2 శాతం ఉండగా, 2023–24లో అది 87.7 శాతానికి పెరి
గింది. జాతీయ సగటు (82.6శాతం)తో పోలిస్తే చిన్నారుల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలో ఉంది.

వివాహ వయసు పరిమితిలో సానుకూల మార్పు
సామాజిక చైతన్యం పెరగడం వల్ల రాష్ట్రంలో జనాభా నియంత్రణ, వివాహ వయసు పరిమితుల్లో సానుకూల మార్పులు వచ్చినట్లు ఈ సర్వే పేర్కొంది. రాష్ట్రంలో సగటు సంతానోత్పత్తి రేటు 1.8 శాతంగా స్థిరపడినట్లు తెలిపింది. ఇది జాతీయ సగటు (2.0 శాతం) కంటే తక్కువగా ఉంటూ జనాభా స్థిరీకరణను సూచిస్తోందని తెలిపింది. బాల్య వివాహాల నియంత్రణలో గత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్లు సర్వే వెల్లడించింది.

మహిళల ఆర్థిక భద్రతలో టాప్‌
మహిళల ఆర్థిక భద్రత, కుటుంబ నిర్ణయాధికారాల్లో ఆంధ్రప్రదేశ్‌.. దేశ సగటును దాటి దూసుకుపోయినట్లు సర్వే వెల్లడించింది. తమ పేరిట సొంతంగా బ్యాంక్‌ లేదా పొదుపు ఖాతా కలిగి ఉండి, దానిని స్వయంగా వినియోగిస్తున్న మహిళల సంఖ్య రాష్ట్రంలో 81.8 శాతం నుండి 92.3 శాతానికి పెరిగినట్లు సర్వే తెలిపింది. ఇది జాతీయ సగటు (89.0 శాతం) కంటే చాలా ఎక్కువ అని పేర్కొంది.

గృహ హింస 29.9 శాతం నుంచి 22.7 శాతానికి తగ్గింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల గృహాలకు మౌలిక వసతులు కల్పించడంలో ఏపీ మెరుగైన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు సర్వే ప్రకటించింది. రాష్ట్రంలో 99.7 శాతం ఇళ్లకు విద్యుత్‌ సౌకర్యం ఉండగా, జాతీయ సగటు 98.3 శాతంగా ఉంది. 97.6 శాతం కుటుంబాలు సురక్షిత తాగునీటి వనరులను పొందుతుండగా, దేశ సగటు 96.5 శాతంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement