కోటి రూపాయల కంపెనీ రూ.22,976 కోట్ల పెట్టుబడి
పది రోజుల కంపెనీతో జనవరి 12న రూ.14,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం
10 నెలలు తిరిగేసరికి మరో రూ.9 వేల కోట్లు పెంచేసి రూ.22,976 కోట్లకు అప్
ఓర్వకల్లులో సెమికండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన
ఎకరం కేవలం రూ.10 లక్షలు చొప్పున 150 ఎకరాల కేటాయింపు
ప్రభుత్వంలో కీలక వ్యక్తిని కలిసిన తర్వాతే అసలు ఈ కంపెనీ ఆవిర్భావం
జనవరి 2న కాన్పూరు ఆర్‌వోసీలో కంపెనీ ఏర్పాటు.. అదే నెల 12న ఈ కంపెనీతో ప్రభుత్వ ఒప్పందం
జపాన్‌కు చెందిన భాగస్వామ్య కంపెనీ ఇతో మైక్రో టెక్నాలజీ పరిస్థితీ అంతంతే
ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కేవలం రూ.249 కోట్లు
వేల కోట్ల నిధులు ఎలా సమకూర్చుకుంటుందని సర్వత్రా చర్చ
పెట్టుబడి ఆమోదం కోసం నేడు ఎస్‌ఐపీబీ ముందుకు ప్రతిపాదనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో ఉర్సా తరహా పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుందా? సొంత కార్యాలయం కూడా లేని ఉర్సా లాంటి కంపెనీకి విశాఖలో వేల కోట్ల రూపాయల విలువైన భూమి కట్టబెట్టడానికి ప్రయత్నించిన కూటమి సర్కారు, ఇప్పుడు అదే తరహాలో ఇండిచిప్ సెమికండక్టర్స్ అనే అతి తక్కువ మూలధనం కలిగిన కంపెనీ భారీ పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం తెలపడానికి సిద్ధమయ్యింది.
10 లక్షల చొప్పున 150 ఎకరాలు
కేవలం కోటి రూపాయల మూలధనం కలిగిన ఇండిచిప్ సెమికండక్టర్స్ రాష్ట్రంలోని ఓర్వకల్లులో ఏకంగా రూ.22,976 కోట్ల భారీ పెట్టుబడితో సెమీకండక్టర్ల తయారీ యూనిట్ పెట్టడానికి ముందుకు వచి్చంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ అధ్యక్షతన సమావేశమైన పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఆమోదం తెలపడమే కాకుండా అనేక రాయితీలను ప్రకటించింది.
ఎకరం భూమి కేవలం 10 లక్షల చొప్పున 150 ఎకరాలు కట్టబెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ ప్రతిపాదనకు శుక్రవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమయ్యే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలపనుంది. తరువాత 10వ తేదీన జరగబోయే మంత్రివర్గ సమావేశం కూడా దీనికి ఆమోదముద్ర వేయనుంది.
భాగస్వామ్య కంపెనీ మూలధనమూ అరకొరే..!
జపాన్‌కు చెందిన ఇతో మైక్రో టెక్నాలజీతో కలిసి ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఇండిచిప్ ఒప్పందం చేసుకుంది. సెమీ కండక్టర్స్ తయారీ రంగంలో ఉన్న ఇతి మైక్రో కంపెనీ పలు దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, ఆర్థికంగా భారీ కంపెనీ ఏమీ కాదు. షెన్‌ఝనోస్టాక్ మార్కెట్‌లో ఇతో మైక్రో టెక్నాలజీస్ నమోదైంది. ఇప్పుడు ఆ కంపెనీ మార్కెట్ క్యాప్ మన భారతీయ కరెన్సీలో కేవలం రూ.249 కోట్లని జపాన్‌కు చెందిన ఈఎన్–ఏఎంబీఐ డాట్ కామ్‌లో ఫైలింగ్స్‌ను పరిశీలిస్తే అర్థమవుతోంది.
కేవలం కోటి రూపాయలతో ఏర్పాటైన ఇండిచిప్ కేవలం రూ.249 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఇతో మైక్రో టెక్నాలజీస్‌తో కలిపి ఏకంగా రూ.22,976 కోట్ల విలువైన పెట్టుబడులను ఎలా సమకూర్చుకుంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇటువంటి కంపెనీకి వందల కోట్ల విలువైన భూమిని ఎలా కేటాయిస్తారన్న అంశంపై చర్చ జరుగుతోంది. అందులోనూ కేంద్ర ప్రభుత్వ నిక్‌డిక్ట్ (ఎన్‌ఐసీడీఐటీ) నిధులతో అభివృద్ధి అవుతున్న ఓర్వకల్లు పారిశ్రామిక వాడ ప్రాంతంలో ఈ భూములను ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఆశ్చర్యకరమైన ‘అడుగులు’!
» ఇండిచిప్ ఒప్పందం పూర్తిగా పరిశీలిస్తే పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
» 2024 డిసెంబర్ నెలలో కొంతమంది వ్యక్తులు కూటమి సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తితో సమావేశమయ్యారు.
» తర్వాత జనవరి 2, 2025న నొయిడా కేంద్రంగా ఇండిచిప్ సెమికండక్టర్స్ పేరిట కంపెనీ ఏర్పాటు చేశారు.
» కేవలం కోటి రూపాయల మూలధనంతో కాన్పూరు ఆర్‌వోసీలో ఈ కంపెనీ నమోదైనట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి.
» ఇలా ఏర్పాటైన 10 రోజుల్లోనే అంటే ఈ ఏడాది జనవరి 12న మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ సమక్షంలో రాష్ట్రంలో రూ.14,000 కోట్ల విలువైన పెట్టుబడులు పెడుతున్నట్లుగా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.
» ఇది జరిగిన 10 నెలలకే ఇప్పుడు ఈ ప్రతిపాదనను దాదాపు 9 వేల కోట్లు పెంచేసి ఏకంగా రూ.22,976 కోట్లకు చేర్చడం గమనార్హం.
» నోయిడా కేంద్రంగా ఏర్పాటైన ఇండిచిప్‌లో పీయూష్ బిచోరియా, వెబ్ చాంగ్, సందీప్ గార్గ్ డైరెక్టర్లుగా, కీలక అధికారిగా రాజీవ్ వ్యవహరిస్తున్నారు. సందీప్ గార్గ్ 2024లో రెండు కంపెనీలు, 2025లో రెండు కంపెనీల్లో డైరెక్టర్లుగా చేరారు. హృషికేష్ దాస్ ఈ ఏడాది జూలై 31న అడిషనల్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
» వీరెవ్వరికి సెమికండక్టర్స్ తయారీ రంగంలో అనుభవం లేకపోవడం గమనించాల్సిన అంశం.
గతంలో నెక్ట్స్ ఆర్బిట్.. ఇప్పుడు ఇండిచిప్
గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో భారీ సెమీకండక్టర్ యూనిట్ వస్తోందని తెగ ప్రచారం చేశారు. నెక్ట్స్ ఆర్బిట్ అనే సంస్థ రూ.50,000 కోట్లతో రాష్ట్రంలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు చేస్తోందని, తద్వారా 1.10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని 2017లో చంద్రబాబు నాయుడు తెగ ఊదరగొట్టారు. అబుదాబీకి చెందిన నెక్ట్స్ ఆర్బిట్ వెంచర్స్ అప్పట్లోనే రెండు బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెడుతోందంటూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఒప్పందం కుదిరాక ఆయన మూడేళ్లు అధికారంలో ఉన్నా.. కార్యాచరణ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విభజన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత కూడా చంద్రబాబు అదే ధోరణిని కొనసాగిస్తున్నారు. ప్రజలకు గత పెట్టుబడుల ప్రకటనలు ఏవీ గుర్తుండవని బలంగా విశ్వసించే ముఖ్యమంత్రి.. అబుదాబి నెక్ట్స్ ఆర్బిట్ స్థానంలో ఇప్పుడు జపాన్ భాగస్వామ్యంతో ఇండిచిప్‌ను ప్రచారంలోకి తీసుకొచ్చారు.


