
నీట్ యూజీ అర్హులకు హెల్త్ యూనివర్సిటీ సూచన
ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా
కౌన్సెలింగ్‌కు త్వరలో నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కోసం త్వరలోనే కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ వెలువడనుందని, విద్యార్థులు అవసరమైన ధ్రువీకరణపత్రాలను సిద్ధం చేసుకోవాలని హెల్త్ యూనివర్సిటీ సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అవసరమయ్యే ధ్రువీకరణపత్రాల తాత్కాలిక జాబితాను యూనివర్సిటీ గురువారం విడుదల చేసింది. ఈ పత్రాలను విద్యార్థులు ముందుగానే సమకూర్చుకుంటే నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. తద్వారా చివరి నిమిషంలో రద్దీ, ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రాసెసింగ్, ధ్రువీకరణలో జాప్యాన్ని నివారించడానికి వీలుంటుందని పేర్కొన్నారు.
విద్యార్థులు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు
⇒ నీట్ యూజీ–2025 ర్యాంక్ కార్డు
⇒ జనన ధ్రువీకరణపత్రం (ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమో)
⇒ ఇంటర్మీడియెట్ మార్క్స్ మెమో
⇒ 6 నుంచి 10వ తరగతి, ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్
⇒ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (ఇంటర్ లేదా 10+2)
⇒ కుల, మైనారిటీ ధ్రువీకరణపత్రం
⇒ ఎకనమిక్ వీకర్ సెక్షన్(ఈడబ్ల్యూఎస్) కోసం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత జారీ చేసిన ఆదాయ, అస్సెట్స్ సర్టిఫికెట్
⇒ తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణపత్రం/రేషన్ కార్డు
⇒ ఆధార్ కార్డు, విద్యార్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
⇒ టస్పోర్ట్స్, ఎన్‌సీసీ, 15 శాతం అన్–రిజర్వ్‌డ్ సీట్లను క్లెయిమ్ చేసుకునే విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణపత్రాలను సమకూర్చుకోవాలి.