రెచ్చిపోయిన గంజాయి ముఠా | Police open fire on key member of ganja gang who attempted to attack them | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన గంజాయి ముఠా

Sep 2 2026 5:31 AM | Updated on Sep 2 2026 5:36 AM

Police open fire on key member of ganja gang who attempted to attack them

తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులపై దాడి చేసి, కృష్ణా జిల్లాకి పరారు 

విజయవాడ శివారు కంకిపాడు వద్ద ప్రధాన నిందితుడిని గుర్తించిన పోలీసులు

పోలీసులపై రాళ్లు, కత్తితో దాడి.. కానిస్టేబుల్‌కు గాయాలు 

నిందితుడిపై కాల్పులు జరిపిన కంకిపాడు సీఐ వివరాలు వెల్లడించిన కృష్ణా జిల్లా ఎస్పీ

కంకిపాడు: చంద్రబాబు కూటమి పాలనలో గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నాయి. పోలీసుల పైనా దాడులకు తెగబడుతున్నాయి. ఇదే విధంగా రెండు ప్రాంతాల్లో పోలీసులపై దాడికి ప్రయత్నించిన గంజాయి ముఠా ప్రధాన సభ్యుడిపై పోలీసులు కాల్పులు జరిపి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ శివారు కంకిపాడులో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలోని ఎర్నగూడెం సర్వీసు రోడ్డుపై సోమవారం హైవే పెట్రోలింగ్‌ పోలీసులు ఒక మోటారు బైక్, ఒక స్కూటీపై బ్యాగులతో తిరుగుతున్న నలుగురు అనుమానితులను ఆపేశారు. 

ఏఆర్‌ పీసీ వి.వెంకటేశ్వరరావు వారిని ప్రశ్నిస్తుండగానే, వారు పదునైన కత్తితో ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి, పరారయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అక్కిదాసరి అవినద్‌గా గుర్తించారు. కానిస్టేబుల్‌పై హత్యాయత్నం చేసిన వ్యక్తి కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన వాడిగా నిర్ధారించారు. వీరు కృష్ణా జిల్లా ఉంగుటూరు, కంకిపాడు పరిసరాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో సోమవారం రాత్రి నుంచి కంకిపాడు, గన్నవరం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వారిని కలపర్రు టోల్‌ గేట్‌ వద్ద ఉన్నట్లు గుర్తించారు. అయితే, వారు పోలీసులకు చిక్కకుండా గుడివాడ అడ్డ రోడ్డు గుండా తప్పించుకున్నారు. 

సోమవారం అర్థరాత్రి కంకిపాడు – ఉంగుటూరు సరిహద్దు ప్రాంతమైన జగన్నాధపురం గ్రామం కర్రల వంతెన (కోమటిగుంట లాకులు) వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నంబరు ప్లేటు లేని మోటరు బైక్‌పై వచ్చి న ప్రధాన నిందితుడు అక్కిదాసరి అవినద్‌ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని వెంబడించటంతో కర్రల వంతెన డొంక రోడ్డులో పడిపోయాడు. అతను రాళ్లు విసరటంతో గన్నవరం సీఐ వాహనం ధ్వంసమైంది. అతన్ని పట్టుకోబోయిన గన్నవరం కానిస్టేబుల్‌ దేవిరెడ్డి శ్రీనుపై కత్తితో దాడి చేయటంతో కానిస్టేబుల్‌ ఛాతీకి బలమైన గాయమైంది. దీంతో గన్నవరం సీఐ బీవీ శివప్రసాద్, కంకిపాడు సీఐ బీబీ రవి­కుమార్‌ గాలిలోకి ఒక రౌండ్‌ కాల్పులు జరిపా­రు. 

అయినా నిందితుడు రాళ్లు రువ్వుతూ కత్తితో మరోమారు దాడికి తెగబడటంతో సీఐ రవికుమార్‌ నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపారు. గాయాలైన నిందితుడిని అదుపులోకి తీసుకుని కంకిపాడు సీహెచ్‌సీకి, అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ శ్రీనును కంకిపాడు సీహెచ్‌సీకి తరలించారు. గన్నవరం సీఐ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తునకు గుడివాడ ఎస్‌డీపీఓ పి.శ్రీనివాస్‌ను ప్రత్యేకాధికారిగా నియమించారు. కాల్పుల జరిగిన ప్రాంతాన్ని, నిందితుడి బైక్‌ను కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు, గుడివాడ ఎస్‌డీపీఓ పి.శ్రీనివాస్, గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర, గన్నవరం, కంకిపాడు సీఐలు శివప్రసాద్, రవికుమార్‌ పరిశీలించారు. చికిత్స పొందుతున్న కానిస్టేబుల్‌ శ్రీనును పరామర్శించారు.

మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై దాడి
సైదాపురం: పోలీసు కానిస్టేబుల్‌పై ఓ యువకుడు మద్యం మత్తులో దాడి చేసిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. సైదాపురం పోలీసు స్టేషన్‌ కానిస్టేబుల్‌ ప్రేమ్‌కుమార్‌ మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయానికి బయలుదేరారు. ఆస్పత్రి సమీపానికి వచ్చేసరికి తోకలపూడికి చెందిన మచ్చా వెంకటేశ్వర్లు మద్యం మత్తులో ఆటోను రహదారికి అడ్డంగా పెట్టాడు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 

అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్‌ ఆటోను తీయాలని వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఎంతసేపటికీ ఆటోను తొలగించకపోవడంతో పాటు ప్రేమ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వర్లు పత్రికలో రాయలేని విధంగా నోటికొచ్చి నట్టు కానిస్టేబుల్‌ చొక్కా పట్టుకుని దురుసుగా ప్రవర్తించాడు. స్థానికులు పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement