పులులు గర్జిస్తున్నాయ్‌! | Sakshi
Sakshi News home page

పులులు గర్జిస్తున్నాయ్‌!

Published Mon, Apr 3 2023 8:21 AM

PM Will Release Details Of Latest Tiger Census On 9th Of This Month - Sakshi

సాక్షి, అమరావతి: మన జాతీయ జంతువు పులిని సంరక్షించేందుకు ‘ప్రాజెక్టు టైగర్‌’ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయింది. అంతరించిపోతున్న పులులను సంరక్షించేందుకు 1973 ఏప్రిల్‌ 1న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కులో ప్రాజెక్ట్‌ టైగర్‌ను ప్రారంభించారు. 9 వేల చదరపు కిలో­మీటర్లలో ఉన్న 9 టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌లతో ఈ ప్రా­జెక్టు మొదలైంది. ఇప్పుడు 18 రాష్ట్రాల పరిధిలోని 75 వేల చదరపు కిలోమీటర్లలో 53 టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌లకు విస్తరించింది. 1973లో జరిగిన మొదటి పులుల గణనలో 1,827 పులులు ఉండగా.. 2018 గణన ప్రకారం ఆ సంఖ్య 2,967కి పెరిగింది. ప్రపంచంలోని ఉన్న మొత్తం పులుల సంఖ్యలో ఇప్పుడు 70 శాతం మన దేశంలోనే ఉన్నాయి. టైగర్‌ ప్రాజెక్టు విజయవంతమైందని చెప్పడానికి ఇవే నిదర్శనాలు. పూర్వం 2 లక్షల పైనే ఉండేవి జీవ వైవిధ్యంలో ఎంతో కీలకమైన పులుల జీవనానికి మన దేశం అత్యంత అనుకూలంగా ఉండేది. చాలా ఏళ్ల క్రితం దేశంలో 2 లక్షలకు పైగా పులులు ఉండేవి.

కానీ.. చక్రవర్తులు, రాజులు పులుల్ని వేటాడటాన్ని ప్రవృత్తిగా ఎంచుకోవడంతో వాటిసంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మొఘల్‌ చక్రవర్తుల కాలంలో పులుల వేట అత్యంత క్రూరంగా సాగింది. ఒక్కో రాజు పదులు, వందల సంఖ్యలో పులుల్ని చంపి.. తాము గొప్ప వీరులమని ప్రచారం చేసుకునేవారు. బ్రిటిష్‌ హయాంలోనూ వాటి వేట ఇష్టారాజ్యంగా కొనసాగింది. బ్రిటీషర్ల కాలంలోనే సాగు భూమి కోసం అడవుల్ని ఆక్రమించడంతో పులుల సంఖ్య తగ్గిపోయింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి 40 వేల పులులు మాత్రమే మిగిలినట్టు అంచనా. పులి అవయవాలన్నింటికీ డిమాండ్‌ ఉండటంతో ఆ తర్వాత కూడా వేట కొనసాగింది.

ఫలితంగా క్రమేపీ అవి అంతరించే దశకు చేరుకున్నాయి. వన్యప్రాణుల చట్టం రక్షించింది 1972లో వన్యప్రాణుల పరిరక్షణ చట్టం రావడం.. పర్యావరణంలో పులుల పాత్ర చాలా ముఖ్యమని భావించడంతో వాటి సంరక్షణకు బీజం పడింది. ఆ నేపథ్యంలోనే 1973లో ప్రాజెక్టు టైగర్‌ ఏర్పాటైంది. 1990వ దశకంలో పులుల ఆవాసాల సంరక్షణ ఇబ్బందిగా మారింది. 1993 నుంచి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అంతచేసినా పులుల సంఖ్య పెరగలేదు. 2006 నాటికి దేశంలో పులులు సంఖ్య 1411కి పడిపోయింది. ఇలాగే వదిలేస్తే పులులు అంతరించే ప్రమాదం ఉందని గ్రహించిన కేంద్రం పులుల సంరక్షణకు ఎన్నో చర్యలు చేపట్టడంతోపాటు సంరక్షణ విధానాన్ని కూడా మార్చింది.

వాటి ఆవాసాలను సంరక్షించడంతోపాటు వేటను చాలావరకు నియంత్రించింది. ఫలితంగా అంతరిస్తున్న పులుల సంఖ్య నెమ్మదిగా పెరిగి కొన్నేళ్లుగా స్థిరంగా ఉంటోంది. 1973లో టైగర్‌ ప్రాజెక్టు బడ్జెట్‌ రూ.4 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.500 కోట్లు. ఇంతచేసినా రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్‌ రిజర్వులో పులులు పూర్తిగా అంతరించిపోయాయి. కానీ.. మిగిలిన రిజర్వు ఫారెస్ట్‌లలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగి 2,967కి చేరింది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జాతీయ స్థాయిలో పులుల సంఖ్యను లెక్కిస్తున్నారు. ఈ నెల 9న ప్రధాని మోదీ మైసూరులో 2022 పులుల గణన వివరాలను విడుదల చేయనున్నారు. ఈ గణనలో పులుల సంఖ్య పెరిగిందనే అంచనాలు వెలువడుతున్నాయి.

(చదవండి: జేఈఈ మెయిన్‌ సిటీ ఇంటిమేషన్‌ లెటర్లు విడుదల)

Advertisement
Advertisement