నాలుగు రోజుల్లోనే రెండోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు
రాష్ట్రంలో రెండుసార్లు కలిపి లీటరు పెట్రోల్‌పై రూ.4.21, డీజిల్‌పై రూ.4.05 వడ్డన.. దేశంలో మన దగ్గరే అత్యధికంగా ఇంధన రేట్లు
లీటరు పెట్రోల్ రూ.114.57, డీజిల్ రూ.102.19కు చేరిక
వినియోగదారులపై ఏడాదికి రూ.4,356 కోట్ల ఆర్థిక భారం
ఎన్నికల ముందు పన్నులు తగ్గించి ఇంధన ధరలు తగ్గిస్తానన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని గాలికొదిలేశారు
సాక్షి, అమరావతి: మళ్లీ ‘పెట్రో’ మంట మండింది. నాలుగు రోజుల వ్యవధిలోనే రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఎన్నికల ముందు తాను అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించడం ద్వారా ఇంధన రేట్లను తగ్గిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక నాలుక మడతపెట్టారు. లీటర్ పెట్రోల్‌ను రూ.114.59కు, డీజిల్‌ను రూ.102.25కు విక్రయిస్తూ దేశంలోనే అత్యధిక ధర గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపారు.
నాలుగు రోజుల కిందట లీటరు పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెరగ్గా... సోమవారం అర్ధరాత్రి నుంచి మరోసారి పెట్రోల్‌పై 92 పైసలు, డీజిల్‌పై 91 పైసలు వడ్డించారు. సామాన్య ప్రజానీకాన్ని కోలుకోలేని దెబ్బతీశారు. ఈ పెంపు ఇక్కడితో ఆగకుండా భవిష్యత్తులోనూ కొనసాగుతుందంటూ చంద్రబాబు ఇంధన పొదుపు చర్యల పేరిట సంకేతాలిస్తుండటం గమనార్హం.
ఈ భారం భరించాల్సిందే..
పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు కారణంగా లారీల అద్దెలు, ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు భారీగా పెరగడంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే సరుకుల రవాణా ఖరీదుగా మారుతోంది. రవాణా చార్జీలు పెరగడాన్ని సాకుగా చూపి మార్కెట్‌లో కూరగాయలు, పప్పులు, వంట నూనెలు, పాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెంచేస్తున్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఏపీలో ట్రాక్టర్లు, బోర్ మోటార్లకు డీజిల్ వాడకం ఎక్కువ. ఈ ధరల పెరుగుదల వల్ల సాగు వ్యయం అధికమవుతుంది.
రైతులు పెట్టుబడి ఖర్చులు కూడా పెట్టలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. ఎన్నికలప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తానని, సూపర్ సిక్స్ హామీలంటూ ఊరించిన చంద్రబాబు, ఇప్పుడు ఇంధన ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతుడటంతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర పన్నులను (వ్యాట్) తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.


