
క్వింటా రూ.6 వేలకు పడిపోయిన వైనం
వైఎస్సార్‌సీపీ పాలనలో క్వింటా ధర రూ.9,700
నేడు కొనేవారు లేక గగ్గోలు పెడుతున్న రైతులు
ఖరీఫ్ సీజన్‌లో కొనసాగుతున్న ధరల పతనం
సీజన్‌లో ఇప్పటివరకు ఏ ఒక్క పంటకూ దక్కని మద్దతు ధర
ధరల పతనంపై అసెంబ్లీలోనే టీడీపీ సభ్యుల ఆందోళన
సాక్షి, అమరావతి: ఉల్లి, టమాటా, చీనీ, అరటి, సజ్జ పంటలు, బంతిపూలతోపాటు నెల్లూరులో పండే సన్నరకాల వరికి కనీస మద్దతుధర లేక గగ్గోలు పెడుతున్న రైతుల సరసన తాజాగా పెసలు పండించిన రైతులు కూడా చేరారు. కూటమి ప్రభుత్వంలో ధరలు పతనమవుతున్న పంటల జాబితాలో తాజాగా పెసర పంట చేరింది. అధికవర్షాలతో దిగుబడి తగ్గి బాధపడుతున్న రైతులు ధర కూడా లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ధరల పతనంపై అసెంబ్లీలో అధికార టీడీపీ సభ్యులే ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
తగ్గిన దిగుబడులు
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో అపరాల సాధారణ సాగువిస్తీర్ణం 7.67 లక్షల ఎకరాలు. ఈ ఏడాది సాగులక్ష్యం 9.70 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.22 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. దీంట్లో ప్రధానంగా 6.5 లక్షల ఎకరాల్లో కంది, 55 వేల ఎకరాల్లో మినుము, దాదాపు 16 వేల ఎకరాల్లో పెసర సాగుచేశారు. ఖరీఫ్‌లో అత్యధికంగా పెసర ఎన్టీఆర్ జిల్లాలో సాగవుతుంది. ఆ తర్వాత చెప్పుకోతగ్గ స్థాయిలో ప్రకాశం, అనంతపురం, నంద్యాల, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల్లో పెసర సాగుచేస్తారు. సాధారణంగా ఎకరాకు 5–6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
ఈ ఏడాది అధికవర్షాల కారణంగా చాలాచోట్ల పెసర పంటకు అపారనష్టం వాటిల్లింది. ఫలితంగా ఈ ఏడాది మూడు క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదని రైతులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ధరలు కూడా పడిపోయాయి. 2024–25 సీజన్‌లో కనీస మద్దతుధర క్వింటాకు రూ.8,558 కాగా.. మార్కెట్‌లో రూ.5,000–రూ.5200కు మించి పలకలేదు. దీంతో రైతులు తీవ్రనష్టాలను చవిచూశారు. కనీసం ఈ ఏడాది అయినా మద్దతుధర దక్కుతుందన్న ఆశతో రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సాగుచేశారు. అయినా ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వైఎస్సార్‌సీపీ పాలనలో పెసర రైతుకు లాభాలు
2025–26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో పెసలకు మద్దతుధర క్వింటా రూ.8,768గా కేంద్రం ప్రకటించింది. కానీ, మార్కెట్‌లో ప్రస్తుతం సూపర్‌డీలక్స్ (పచ్చపెసలు) క్వింటా రూ.6 వేలు పలుకుతుంటే, రెండో క్వాలిటీగా పిలిచే రంగుమారిన పెసలకు క్వింటా రూ.2,000–రూ.2500 మించి పలకడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24 సీజన్‌లో సూపర్‌డీలక్స్‌గా పిలిచే పచ్చ పెసలకు రూ.9,100 నుంచి రూ.9,700 వరకు ధర వచి్చంది. రెండో క్వాలిటీ పెసలకు సైతం క్వింటా రూ.4,500 నుంచి రూ.6 వేల మధ్య పలికిందని, మంచి లాభాలను కళ్లచూశామని రైతులు చెబుతున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పెసలకు కనీస మద్దతు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెసలు కొనేవారు లేరు
అసెంబ్లీలో సోమవారం వ్యవసాయంపై జరిగిన లఘుచర్చలో నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ పెసలకు కనీస మద్దతుధర లేక తమ నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కనీసం కొనేవారు లేరని చెప్పారు. పంటకు ధరలేక రైతులు బాధపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేనే తమ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం చూస్తే అన్నదాతల దయనీయస్థితి తెలుస్తోంది. సీజన్ ఆరంభంలోనే ఇలా వరుసగా ఖరీఫ్ పంట ఉత్పత్తులకు మద్దతుధర లభించని పరిస్థితి నెలకొనడంతో పూర్తిస్థాయిలో పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చే సమయానికి ఇంకా ఏ స్థాయికి దిగజారిపోతాయోననే ఆందోళన రైతుల్లో నెలకొంది.