బురద జల్లడమే జనవాణి అజెండా.. ఫ్యాక్ట్‌ చెక్‌

Pawan Kalyan False Allegations On Government In Janavani - Sakshi

ప్రభుత్వంపై పవన్‌ నిరాధార ఆరోపణలు

తిరుపతి స్థల వివాద ఘటనపై కలెక్టర్‌ నివేదిక

జనసేనాని అక్కసు మరోసారి బట్టబయలు

సాక్షి, అమరావతి: దున్నపోతు ఈనిదంటే.. దూడను గాటన కట్టేయమన్న తరహాలో విపక్ష టీడీపీ, జనసేన, వాటికి కొమ్ముకాసే మీడియా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా రాజకీయ రంగు పులిమి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం వారికి రివాజుగా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తాజాగా నిర్వహించిన ‘జనవాణి’ కార్యక్రమమే ఇందుకు నిదర్శనం.

విజయవాడలో ఆదివారం జరిగిన ‘జనవాణి’ వేదికగా వాస్తవాలు తెలుసుకోకుండా పవన్‌ కల్యాణ్‌ తన అక్కసు వెలిబుచ్చారు. తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన అనిత అనే మహిళ పేరుతో అవాస్తవాలను వల్లించారు. ఆమె స్థలాన్ని వైఎస్సార్‌సీపీ నాయకుడు కబ్జా చేశాడంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆమె స్థలం కబ్జాకు గురైందన్న ఆరోపణలపై విచారణలో వెలుగు చూసిన అంశాలను తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు. పవన్‌ డ్రామాలు కలెక్టర్‌ నివేదికతో బహిర్గతమయ్యాయి.

విచారణలో వెలుగు చూసిన వాస్తవాలను పరిశీలిస్తే... 
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామం తారకరామ నగర్‌లో అనిత అనే మహిళకు 2004లో ప్రభుత్వం ప్లాట్‌ నంబర్‌ 2400లో ఇంటి పట్టా కేటాయించింది. 6 నుంచి 12 నెలల్లోగా అందులో ఇల్లు లేదా గుడిసె నిర్మించుకుని స్వాధీనంలో ఉంచుకోవాలని షరతు విధించింది.

► 2004 నుంచి తమకు కేటాయించిన ప్లాట్లలో గుడిసె / ఇల్లు నిర్మించుకోని 989 మందికి 2018లో టీడీపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. లబ్ధిదారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్లాట్లను రద్దు చేసి అర్హులైన ఇతరులకు పంపిణీ చేపట్టింది. 

► ఈ క్రమంలో ప్లాట్‌ నంబరు 2400ని గత సర్కారు వి.వెంకటేష్‌ అనే వ్యక్తికి కేటాయిస్తూ 2018లో ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేసింది. అందులో వెంకటేష్‌ షెడ్డు నిర్మించుకుని ఇంటి పన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తున్నాడు.  

►షెడ్డు నిర్మిస్తున్న సమయంలో అనిత, వెంకటేష్‌ మధ్య వివాదం చోటు చేసుకుంది. అనిత షెడ్డును స్వాధీనం చేసుకోవడంతో ఆమెపై వెంకటేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అనిత నుంచి షెడ్డును స్వాధీనం చేసుకున్న వెంకటేష్‌ చుట్టూ ప్రహరీగోడ నిర్మించుకున్నాడు.

► వైఎస్సార్‌సీపీతో వెంకటేష్‌కు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈ వివాదం 2019 తర్వాత చోటు చేసుకున్నది కూడా కాదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top