ఆధార్‌ ‘పరీక్ష’ పాస్‌ కాకుంటే జీతాలు కట్‌ | Orders Issued to Withhold May Month Salaries of Village and Ward Secretariat Employees: AP | Sakshi
Sakshi News home page

ఆధార్‌ ‘పరీక్ష’ పాస్‌ కాకుంటే జీతాలు కట్‌

May 23 2026 5:22 AM | Updated on May 23 2026 5:23 AM

Orders Issued to Withhold May Month Salaries of Village and Ward Secretariat Employees: AP

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మే నెల జీతాలు నిలిపివేయాలంటూ ఆదేశాలు  

సాక్షి, అమరావతి: ఆధార్‌ సెంటర్‌ నిర్వహణకు అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదనే నెపంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాలను నిలిపివేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగిన వ్యక్తులే ఆధార్‌ సేవలు అందించే ఉద్దేశంతో ఆధార్‌ జారీ సంస్థ యూఐడీఏఐ ఇటీవల లెర్నింగ్ మేనేజ్మెంట్‌ సిస్టం(ఎల్‌ఎంఎస్‌) అర్హత పరీక్ష పాస్‌ కావాలనే నిబంధన తీసుకొచ్చింది.

ఆధార్‌ సేవలను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించేందుకు సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులతో పాటు డిజిటల్‌ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, వార్డు అడ్మిన్‌ సెక్రటరీలు, వార్డు డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలు, వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీలు సంబంధిత అర్హత పరీక్షకు నమోదు చేసుకుని పాస్‌ కావాలంటూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గతంలో ఆదేశాలు జారీ చేసింది.

అయితే, పరీక్ష పాస్‌ కాని వారికి మే నెల జీతాలను నిలిపివేయాలంటూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. మరే ప్రభుత్వ శాఖలో లేని విధంగా కేవలం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలోనే చంద్రబాబు ప్రభుత్వం రకరకాల నిబంధనలు అమలు చేస్తుందంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement