
రైతు బజారులో కిలో ఉల్లి రూ.24 పైనే
రైతుకు దక్కేది రూ.2 నుంచి రూ.4 మాత్రమే
కర్నూలు మార్కెట్ యార్డులో రైతుల ఆర్తనాదాలు
ఉల్లి ధరల పతనంపై సీఎం సమీక్ష
క్వింటాల్ రూ.1,200కు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశం
సాక్షి, అమరావతి: ఉల్లి ధరలు రోజురోజుకీ పతనమవుతున్నాయి. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి బస్తాల మేటలు పేరుకుపోతుండగా.. కోత ఖర్చులు కూడా రాక అనేకమంది రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లోని పంటను మేకలు, గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. నాలుగు రోజులుగా మార్కెట్‌కు వస్తున్న ఉల్లిని కొనేవారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు.
మార్కెట్‌కు వస్తున్న పంటలో నాలుగో వంతు సరుకును కూడా కొనేవారు లేరు. గురువారం కర్నూలు మార్కెట్‌కు 3,980 క్వింటాళ్ల ఉల్లి రాగా.. వెయ్యి టన్నుల కూడా ట్రేడర్లు కొనుగోలు చేయలేదు. దీంతో మార్కెట్‌కు తెచ్చిన పంటను తిరిగి తీసుకెళ్లలేక అక్కడే వదిలేస్తున్నారు. గురువారం కనిష్ట ధర క్వింటా రూ.520 పలకగా.. గరిష్టంగా రూ.1,149 లభించింది.
అమ్ముడైన లాట్లలో 95 శాతం ఉల్లికి క్వింటాల్‌కు రూ.500–600 మించి ధర దక్కలేదు. క్వాలిటీ లేదనే సాకుతో వ్యాపారులు ధఱ తగ్గించేస్తున్నారు. కాగా.. రాష్ట్రంలోని రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.24–26 తక్కువకు దొరకడం లేదు. కర్నూలు మార్కెట్ యార్డులో మాత్రం రైతులకు కిలో రూ.2 నుంచి రూ.4 మాత్రమే ఇస్తున్నారు.
రూ.1,200 తక్కువ కాకుండా కొనండి: సీఎం
రైతుల నుంచి క్వింటాల్ ఉల్లిని రూ.1,200కు తక్కువ కాకుండా తక్షణమే కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించిన సీఎం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి నష్టాన్ని భరించాలని, కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఆరబెట్టి రైతు బజార్లకు పంపిణీ చేయాలన్నారు. ఉల్లికి మంచి ధర వచ్చేవరకూ కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం
కల్పించాలన్నారు.
ఉల్లి రైతులను గాలి కొదిలేస్తారా?
తాడేపల్లిగూడెం: కర్నూలు ఉల్లి రైతులు ధర దక్కక సంక్షోభంలో కూరుకుపోతే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురామ్ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి అన్ని రకాలుగా ఆదుకుందని గుర్తు చేశారు.
కర్నూలు ప్రాంత ఉల్లి రైతులు పంటను మార్కెట్‌కు తీసుకొచ్చినా కనీస ధర కూడా దక్కడం లేదన్నారు. దీంతో ఉల్లి పంటను పశువులకు మేతగా వదిలేస్తున్నారన్నారు.మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రభుత్వం కర్నూలు ఉల్లికి కనీస మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర దక్కేవరకు ఉల్లి రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు.