పీజీ చదివేవారేరి? | Sakshi
Sakshi News home page

పీజీ చదివేవారేరి?

Published Sun, Feb 13 2022 5:51 AM

No Students For PG Education Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)ల్లోని వివిధ పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ఏటా సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. బీటెక్‌తోనే విద్యార్థులకు భారీ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. బీటెక్‌తోనే మంచి ఉద్యోగాలు వస్తుండటంతో ఎక్కువ మంది విద్యార్థులు పీజీ, పీహెచ్‌డీ వైపు మొగ్గు చూపడం లేదు. అలాగే బీటెక్‌లోని కొన్ని కోర్సుల్లోనూ సీట్లు భర్తీ కావడం లేదు. ఈ సమస్య ప్రధానంగా కొత్త ఐఐటీల్లో కనిపిస్తోందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

గత రెండేళ్లలో భర్తీ కాని సీట్లు..
గత రెండేళ్లలో ఐఐటీల్లోని వివిధ కోర్సుల్లో 10,780 సీట్లు, ఎన్‌ఐటీల్లో 8,700 సీట్లు మిగిలిపోయినట్లు కాగ్‌ పేర్కొంది. 2020–21 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో 5,484 సీట్లు భర్తీ కాలేదు. వీటిలో బీటెక్‌ కోర్సుల సీట్లు 476 ఉండగా పీజీ కోర్సుల సీట్లు 3,229 ఉన్నాయి. అలాగే పీహెచ్‌డీ కోర్సుల్లో 1,779 సీట్లు భర్తీ కాలేదు. కాగా కొత్త ఐఐటీలైన భువనేశ్వర్, గాంధీనగర్, హైదరాబాద్, ఇండోర్, జోధ్‌పూర్, మండి, పాట్నా, రోపార్‌ల్లో సీట్లు ఎక్కువ మిగిలిపోయినట్లు కాగ్‌ నివేదిక వెల్లడించింది. ఇక 2021–22లో అన్ని ఐఐటీల్లో 5,296 సీట్లు భర్తీ కాలేదు. వీటిలో బీటెక్‌ కోర్సుల్లో 361 సీట్లు, పీజీ కోర్సుల్లో 3,083 సీట్లు, పీహెచ్‌డీ కోర్సుల్లో 1,852 సీట్లు ఖాళీగా మిగిలిపోయినట్లు కాగ్‌ పేర్కొంది.

ప్లేస్‌మెంట్లకే విద్యార్థుల ప్రాధాన్యత
మరోవైపు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో బీటెక్‌ పూర్తికాగానే విద్యార్థులు మంచి కొలువులకే ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో పీజీ, పీహెచ్‌డీ సీట్ల వైపు వారు మొగ్గు చూపడం లేదు. బీటెక్‌ ఉత్తీర్ణతతోనే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతుండటంతో పీజీ, పీహెచ్‌డీల్లో చేరడానికి విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. పరిశోధనలంటే ఆసక్తి, ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు మాత్రమే పీజీ, పీహెచ్‌డీల్లో చేరుతున్నారు. అయితే వీరి సంఖ్య అతి స్వల్పంగా ఉంటోంది. పైగా ఐఐటీల్లో పీజీ ప్రవేశాలకు గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌)ను నిర్వహిస్తున్నారు. బీటెక్‌ ఉత్తీర్ణులు గేట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని కాగ్‌ వెల్లడించింది. 2014 నుంచి 2019 వరకు చూస్తే ఐఐటీలలోని పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో 28 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి.

భర్తీ కాని సీట్లు ఎన్‌ఐటీల్లోనే అధికం
ఐఐటీలతో పోలిస్తే ఎన్‌ఐటీల్లో సీట్లు ఎక్కువగా మిగిలిపోతున్నట్టు కాగ్‌ వెల్లడించింది. ముఖ్యంగా కొత్త ఎన్‌ఐటీల్లో సీట్లు భర్తీ కావడం లేదని పేర్కొంది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఆరు నుంచి ఏడు రౌండ్ల కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నా సీట్లు మిగిలిపోతుండడం గమనార్హం. కొన్నిసార్లు స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ను చేపడుతున్నా ఇదే పరిస్థితి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు పరిశోధనలకు ఉద్దేశించినవే అయినా వాటిలో పీహెచ్‌డీ సీట్లు భర్తీ కావడం గగనంగా మారుతోంది. వివిధ ప్రవేశ పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ చూపినవారికే ఈ కోర్సుల్లో అవకాశం కల్పిస్తున్నారు. ఈ స్థాయిలో మెరిట్‌ సాధిస్తున్నవారు లేకపోవడం కూడా ఈ సీట్లు మిగిలిపోవడానికి మరో కారణమని నిపుణులు చెబుతున్నారు. కాగ్‌ నివేదిక ప్రకారం.. అర్హత గల అభ్యర్థులు లేకపోవడం వల్ల పీహెచ్‌డీ సీట్లు భర్తీ చేయలేకపోతున్నట్లు ఆయా ఐఐటీలు పేర్కొన్నాయి. టాప్‌ ఐఐటీల్లో ఒకటైన ఢిల్లీలో 800 పీహెచ్‌డీ సీట్లు ఉండగా.. ఏటా 500 మాత్రమే భర్తీ అవుతున్నాయి. 

Advertisement
Advertisement