
ప్రమాదం జరగ్గానే హడావుడి ప్రకటనలు
అనకాపల్లి ఎసెన్షియా ఫార్మా దుర్ఘటనపై గత ఏడాది సెప్టెంబర్‌లో కమిటీ ఏర్పాటు
ఏడాది గడిచినా నివేదిక లేదు..
సాక్షి, అమరావతి: కార్మికుల భద్రతను, ప్రాణాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. వరుసగా జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాల్లో అనేకమంది పేదల జీవితాలు బుగ్గిపాలవుతున్నా ప్రభుత్వం పూర్తి అలసత్వంతో వ్యవహరిస్తోంది. ఏదైనా దుర్ఘటన జరిగిన వెంటనే ఒకటి రెండురోజులు హడావుడి చేసి కమిటీలు వేసి చేతులు దులుపుకోవడం అలవాటుగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దుర్ఘటనల్లో ఏ ఒక్కదాంట్లో కూడా ఇంతవరకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదు. గతేడాది ఏప్రిల్‌లో అనకాపల్లిలోని ఎస్‌బీ ఆర్గానిక్స్‌లో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించగా 16 మంది గాయపడ్డారు.
ఆ తర్వాత ఆగస్టులో ఎసెన్షియా ఫార్మాలో జరిగిన ఘోర ప్రమాదంలో 18 మంది మృతిచెందగా అనేకమందికి గాయాలయ్యాయి. ఈ రెండు భారీ ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెపె్టంబర్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి వసుధ మిశ్రా నేతృత్వంలో 17 మందితో ఒక కమిటీ ఏర్పాటుచేసింది. పరిశ్రమలను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై త్వరితగతిన నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని కోరింది. వసుధ కమిటీ ఏర్పడి ఏడాది దాటినా ఇంతవరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక కూడా ఇవ్వలేదు. కనీసం ఈ నివేదిక ఏ స్థాయిలో ఉందో ఫ్యాక్టరీస్ డిపార్ట్ట్‌మెంట్ కూడా చెప్పలేకపోతోందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మామూళ్ల మత్తు.. భద్రత చిత్తు
అనకాపల్లి పార్మా ఘటనల తర్వాత కూడా ఫ్యాక్టరీస్ విభాగం మొద్దునిద్ర వదలడం లేదు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వకుండా కొందరు అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారు. దీంతో వరుస ఘటనల్లో అనేకమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అనకాపల్లిలో రెండు ఫార్మా ఘటనల తర్వాత తిరుపతిలో ఒక ఉక్కుకర్మాగారంలో ప్రమాదం జరిగింది. అనకాపల్లిలో బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ప్రమాదంలో ఆరుగురికిపైనే దుర్మరణం పాలయ్యారు. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడలేదు. ఈ నేపథ్యంలో రాయవరంలో బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు.