కొత్త లైట్‌హౌస్‌ నిర్మాణానికి సన్నాహాలు

New Lighthouse Near Bheemili Beach Under Construction - Sakshi

స్థలం పరిశీలించిన అధికారులు 

భీమునిపట్నం: భీమిలి బీచ్‌ సమీపంలో కొత్త లైట్‌హౌస్‌ నిర్మాణానికి అధికారులు ప్రయత్నాలు చేస్తుండడంతో త్వరలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. బ్రిటిష్‌ వారు ఇక్కడ ఉన్న సమయంలో సముద్రంలో పోర్టును ఏర్పాటు చేసుకోవడం ద్వారా వస్తువులు, సామాగ్రిని ఎగుమతులు, దిగుమతులు చేసుకునేవారు. ఇందుకోసం ఇక్కడకు వచ్చి వెళ్లే ఓడలకు దిక్సూచిగా ఉండడం కోసం 1854లో బీచ్‌ వద్ద లైట్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు.

దాంతోపాటు మున్సిపల్‌ కార్యాలయం వద్ద పోర్టు షిప్పింగ్‌ కార్యాలయం, బీచ్‌కు సమీపంలో లైట్‌హౌస్‌ నిర్వహణ చూసుకునే సిబ్బంది క్వార్టర్లు నిర్మించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వీటి నిర్వహణ బాధ్యత కాకినాడ పోర్టు ఆధీనంలోకి వెళ్లింది. కాగా పోర్టు కార్యాలయంలో ఒక కన్సర్వేటర్, ఇద్దరు సిబ్బంది ఉండేవారు. వారు లైట్‌హౌస్‌ నిర్వహణ చేసేవారు.

అయితే సిబ్బంది క్వార్టర్స్‌లో ఎవరూ ఉండకపోవడంతో అవి శిథిలమైపోయాయి. ఇదిలా ఉండగా సుమారు పది సంవత్సరాల క్రితం కాకినాడ పోర్టు ఆధీనంలో ఉన్న ఈ లైట్‌హౌస్‌ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖకు చెందిన షిప్స్‌ అండ్‌ లైట్‌హౌసెస్‌ విభాగం ఆధీనంలోకి వెళ్లగా వారి పర్యవేక్షణలో ఉంది. అలాగే పోర్టు కార్యాలయం మూతపడిపోవడంతో సిబ్బందిని వేరే ప్రాంతాలకు బదిలీ చేసేశారు. 

మత్స్యకారులకు ఉపయోగం 
ఇక్కడ ఉన్న లైట్‌హౌస్‌ బ్రిటిష్‌ వారి పోర్టు మూతపడిపోయి కాకినాడ పోర్టు ఆధీనంలోకి వెళ్లినప్పటికీ పని చేస్తూనే ఉంది. సాయంత్రం చీకటి పడిన తర్వాత సిబ్బంది దీన్ని వెలిగిస్తారు. ఉదయం ఆర్పేస్తారు. ఇలా రోజూ జరుగుతుంది. కాగా భీమిలితోపాటు చుట్టుపక్కల చిప్పాడ, అన్నవరం బీచ్‌రోడ్డులోని చేపలుప్పాడ, మంగమారిపేట మరికొన్ని గ్రామాల్లోని మత్స్యకారులు రోజూ రాత్రి, తెల్లవారుజామున సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుంటారు.

వారికి ఇది దిక్సూచిగా ఉండి ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఇది బాగా పాతపడిపోవడం వల్ల కాంతి విహీనంగా మారడంతో అంతంత మాత్రంగానే పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏడు సంవత్సరాల క్రితం మరో ప్రాంతంలో వంద అడుగుల ఎత్తులో పెద్ద లైట్‌హౌస్‌ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో ఇటీవల కొత్త లైట్‌హౌస్‌ నిర్మాణానికి స్థల పరిశీలన కోసం అధికారుల బృందం వచ్చింది. పాత లైట్‌హౌస్‌ సమీపంలో శిథిలమైన సిబ్బంది క్వార్టర్స్‌ స్థలాన్ని పరిశీలించారు.

ఇక్కడ లైట్‌హౌస్‌ నిర్మించడమే కాకుండా పర్యాటకులు వచ్చి సందర్శించడానికి అనుకూలంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈ స్థలంలో లైట్‌హౌస్‌ నిర్మాణం పూర్తయితే సముద్రంలో తిరిగే ఓడలకు, తీరప్రాంత మత్స్యకారులకు ఎంతో సదుపాయంగా ఉండడంతోపాటు, పర్యాటకులు సందర్శించడానికి  బాగుంటుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top