మొదలైన పెట్టుబడుల కార్యాచరణ 

A monitoring committee was formed with 17 members as chairman of CS - Sakshi

సీఎస్‌ చైర్మన్‌గా 17 మంది సభ్యులతో మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు 

జీఐఎస్‌ ఎంఓయూలు వేగంగా వాస్తవ రూపంలోకి తేవడమే కమిటీ లక్ష్యం 

ప్రతీ 15 రోజులకొకసారి కమిటీ సమీక్ష 

ఎంఓయూలపై ఇప్పటికే కమిటీ భేటీ 

ఎప్పటిలోగా ఉత్పత్తిలోకి తీసుకు వచ్చేది చెప్పాలంటూ కంపెనీలను కోరిన పరిశ్రమల శాఖ 

సాక్షి, అమరావతి:  విశాఖ వేదికగా మార్చి 3–4 తేదీల్లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాలను వాస్తవ రూపంలోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. సదస్సులో కుదిరిన ఒప్పందాలను సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తీసుకురావడానికి సీఎస్‌ చైర్మన్‌గా 17 మంది సభ్యులతో మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు.

ఈ కమిటీకి మెంబర్‌ కన్వీనర్‌గా రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. వీరితో పాటు వ్యవసాయ, పశు సంవర్థక,  ఆర్థిక, ఇంధన, జలవనరులు, పర్యాటక, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జీఏడీ (కో–ఆర్డినేషన్‌), స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్, శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్లానింగ్, ఐటీ–ఐటీఈఎస్, ట్రాన్‌పోర్ట్‌ శాఖల కార్యదర్శలు సభ్యులుగా ఉంటారు. వీరుకాకుండా అవసరమైతే ఇతర శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తారు.

ప్రతీ శాఖలో కుదరిన ఒప్పందాలను ఆయా ఇన్వెస్టర్లతో సమీక్షించి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పటిలోగా ఉత్పత్తిలోకి తీసుకొస్తారన్న అంశాలపై ఒక అజెండాను రూపొందించి ఆ వివరాలను పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు సమీక్ష కోసం మానిటరింగ్‌ కమిటీకి ఇవ్వాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఇక మానిటరింగ్‌ కమిటీ తరచూ సమావేశమై పెట్టుబడులను త్వరితగతిన వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి ఉన్న అడ్డంకులు, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు.

విశాఖ జీఐఎస్‌–2023 సమావేశాల సందర్భంగా మొత్తం 386 ఒప్పందాలు జరిగినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా రూ.13,11,468 కోట్ల పెట్టుబడులతో పాటు 6,07,383 మందికి ఉపాధి లభించనుంది. 
 
ప్రతీ 15రోజులకోసారి సమీక్షిస్తాం 
జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖలను విశాఖకు తీసుకొచ్చి లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రం ఇప్పుడు వాటిని వాస్తవరూపం తీసుకురావడంపై దృష్టిసారించింది. ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలు ఎప్పటిలోగా ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నాయో అన్న దానిపై సమాచారం సేకరించి దానికనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం.

ఇందులో భాగంగా తొలి సమావేశం గత శుక్రవారం సీఎస్‌ అధ్యక్షతన జరిగింది. ఇలా ప్రతీ 15 రోజులకొకసారి సమావేశమై ఎంఓయూల  పరిస్థితిని సమీక్షిస్తాం.  – జి. సృజన, రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్‌    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top