శ్రీకాకుళం : జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈరోజు(శనివారం) ఏకాదశి పురస్కరించుకుని అత్యధిక సంఖ్యలో భర్తులు రావడంతో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అయితే శనివారం సాయంత్రం మంత్రి లోకేష్.. తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ దేవాలయాన్ని సందర్శించారు.
దీనిలో భాగంగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట అంశానికి సంబంధించి పొంతనలేని మాటలు మాట్లాడారు. ప్రతీ శనివారం వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా, పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా లేదన్నారు.
భక్తుల రద్దీకి ఉచిత బస్సు కూడా కారణమని లోకేష్ చెప్పిన సమాధానం వింతగా ఉంది. ఉదయం ఆరు గంటలకే భక్తులు అక్కడికి చేరుకున్నా సమాచారం లేదని దాటవేత సమాధానం చెప్పారు లోకేష్. ఒక ఊరి నుంచి వంద మంది వస్తే తెలుస్తుంది కానీ.. ఒక ఊరి నుంచి పది మంది చొప్పున వస్తే ఎలా తెలుస్తుందని ఎదురు ప్రశ్నించారు. ఇలా లోకేష్ మాటల్లో తడబాటు కనబడింది.
ధర్మకర్త వీడియో వెలుగులోకి.. సర్కారు వైఫల్యమే కారణం
పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదనేది కూటమి పెద్దలు చెప్పే వాదన తప్పు అని ధర్మకర్త పాండా మాటల్లోనే తేలిపోయింది. పోలీసులకు నిన్ననే సమాచారం ఇచ్చామని ధర్మకర్త పాండా చెప్పిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ధర్మకర్త స్థానంలో ఉన్న పాండా సమాచారం ఇచ్చినా సర్కారు తగిన భద్రత కల్పించకపోవడం గమనార్హం.
ముందస్తు సమాచారం లేదంటూ మంత్రులు, అధికారుల ప్రకటించగా, సమాచారం ఇవ్వలేదా అని పాండాను మీడియా ప్రశ్నించింది. ‘ఈరోజు కాదు.. నిన్నే పోలీసులకు చెప్పా’ అని పాండా చెప్పారు. దీనికి సంబంధించిన ఆ వీడియో బయటకి రావడంతో సర్కారు వైఫల్యం బట్టబయలైంది. దాంతో తర్వాత ధర్మకర్త పాండాతో సమాచారం ఇవ్వలేదని, ఇంతమంది భక్తులు వస్తారని అనుకోలేదంటూ అధికారులు చెప్పించడంతో సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందనడానికి ఉదాహరణ.


