మంగళగిరి: సామాజిక మాధ్యమాల్లో పరిచయాల పట్ల యువతులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి మేకతోటి సుచరిత సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో ఉన్న రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో గురువారం ఆ కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మతో కలిసి హోంమంత్రి ఈ నారీ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సుచరిత విలేకరులతో మాట్లాడుతూ మహిళల రక్షణకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. అందులో భాగంగా యూనివర్సిటీలు, కళాశాలల్లోని యువతులకు సామాజిక మాధ్యమ పరిచయాలు–అనర్థాలపై రోజుకు పదివేల మందికి అవగాహన కల్పించేందుకు మహిళా కమిషన్ ఈ నారీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. రమ్య హత్యను కొందరు రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమన్నారు. జాతీయ కమిషన్ ప్రభుత్వ పనితీరుకు 200 మార్కులు ఇచ్చిందని, ప్రతిపక్షపార్టీలకు అది కనిపించలేదా అని ప్రశ్నించారు. మహిళకు ఓ పోలీసును కాపలా పెట్టాలా అని ప్రశ్నించిన చంద్రబాబుకు నేడు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
ఎంత ఉపయోగమో.. అంత అనర్థం
సామాజిక మాధ్యమాల ద్వారా ఓ యువకుడు 200 మంది మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు దిగిన విషయాన్ని గుర్తుచేస్తూ సామాజిక మాధ్యమాల వల్ల ఎంత ఉపయోగమో అంత అనర్థం కూడా ఉందని గ్రహించాలని కోరారు. ఇప్పటికే దిశ యాప్, దిశ చట్టంతో రాష్ట్రంలో ఎక్కడ మహిళకు అన్యాయం జరిగినా పోలీసులు సత్వరమే స్పందిస్తున్నారన్నారు. ప్రతి యువతి, మహిళ తన ఫోన్‌లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. సమాజంలో సామాజిక బాధ్యత కొరవడిందని, నడిరోడ్డులో రమ్యపై దాడి జరుగుతుంటే ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించకపోవడం బాధాకరమని చెప్పారు.
ప్రజలలో సామాజిక బాధ్యత పెరిగి మహిళలపై దాడులు జరిగినప్పుడు వెంటనే స్పందిస్తే కొంతవరకు నేరాలను అరికట్టవచ్చని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ఈ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం (నేడు) నుంచి వచ్చే నెల 27వ తేదీ వరకు నెలరోజుల పాటు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళలు, యువతులపై దాడుల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగేందుకు వివిధ రంగాల ప్రముఖులతో అన్ని జిల్లా కేంద్రాల్లో చర్చాగోష్ఠులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ చైర్‌పర్సన్ పద్మావతి, డైరెక్టర్ సియాజ్, కార్యదర్శి నిర్మల తదితరులు పాల్గొన్నారు.
‘సామాజిక’ అనర్థాలపై ‘ఈ నారీ’ అవగాహన
Published Fri, Aug 27 2021 4:31 AM | Last Updated on Fri, Aug 27 2021 4:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment