ప్రతి నియోజకవర్గంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌

Mekapati Goutham Reddy says Center of Excellence in every constituency - Sakshi

ఏయూ క్యాంపస్‌ (విశాఖ తూర్పు): విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం వేదికగా దేశంలో నాలుగో నాస్కామ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (ఐవోటీ–ఏఐ)ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గౌతంరెడ్డి మాట్లాడుతూ.. నాస్కామ్‌ సెంటర్‌ వ్యవసాయ, వైద్య రంగాల అవసరాలు తీర్చే దిశగా పనిచేస్తుందన్నారు. అలాగే అమెజాన్‌తో సెంటర్‌ ఆఫ్‌ టెక్నాలజీని ఏర్పాటు చేసే ప్రతిపాదనను సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ప్రతి నియోజకవర్గంలో ఒక సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. వ్యవసాయ, వైద్య, సంక్షేమ రంగాలు టెక్నాలజీతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. ప్రజలను కేంద్రంగా చేసుకుని టెక్నాలజీని అభివృద్ధి చేయాలని కోరారు. తొమ్మిది టెక్నాలజీలను గుర్తించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌– మెషీన్‌ లెర్నింగ్, రోబోటిక్స్‌–ఆటోమేషన్, హెచ్‌–కంప్యూటింగ్, క్వాంటమ్‌ కంప్యూటింగ్, వర్చువల్‌ రియాలిటీ, బ్లాక్‌చైన్, 5జీ, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభిస్తున్న వర్క్‌ ఫ్రం హోం విధానం ఇతర రాష్ట్రాలకు, దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. దీని ప్రారంభానికి రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. 

ప్రధాని మోదీ పాలనలో నూతన అవకాశాలు..
కేంద్ర సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ప్రజల జీవనంలో టెక్నాలజీ గణనీయ మార్పును తెస్తోందన్నారు. అంతర్జాతీయంగా నాణ్యమైన సేవలు అందించే కేంద్రంగా ఏయూ నిలిచిందని చెప్పారు. ప్రధాని మోదీ పాలనలో నూతన అవకాశాలను సృష్టించామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థలు కలసి పనిచేస్తే నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు.

నాస్కామ్‌ అధ్యక్షురాలు దేబ్‌జాని ఘోష్‌ మాట్లాడుతూ.. టెక్నాలజీ విభిన్న సమస్యలకు పరిష్కారాలను చూపుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అజయ్‌ ప్రకాష్‌ షానాయి, రాష్ట్ర ఐటీ, నైపుణ్య శిక్షణ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ రవీంద్రబాబు, జెడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top