‘వైఎస్సార్‌ కప్‌’ మెగా క్రికెట్‌ సంరంభం | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌ కప్‌’ మెగా క్రికెట్‌ సంరంభం

Published Tue, Dec 22 2020 3:52 AM

Mega cricket tournament organized under the name of YSR Cup started on 22nd Dec - Sakshi

దొండపర్తి (విశాఖ దక్షిణ): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ‘వైఎస్సార్‌ కప్‌’ పేరిట నిర్వహిస్తున్న మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పోర్టు స్టేడియంలో ఎంపీ వి.విజయసాయిరెడ్డి టార్చ్‌ వెలిగించి టోర్నీని ప్రారంభించారు. ఈ నెల 22నుంచి జనవరి 9వ తేదీ వరకు నిర్వహించే టోర్నమెంట్‌లో విశాఖ నగర పరిధిలోని 98 వార్డుల నుంచి 422 క్రికెట్‌ జట్లు తలపడుతున్నాయి. విజేతలకు రూ.50 లక్షలు విలువ చేసే బహుమతులను అందజేయనున్నారు. ప్రారంభ కార్యక్రమానికి అన్ని జట్ల నుంచి 6,500 మంది ఆటగాళ్లు హాజరవడంతో మైదాన ప్రాంగణం కోలాహలంగా మారింది. ఎన్‌సీసీ క్యాడెట్స్‌ మార్చ్‌ఫాస్ట్, ఏయూ విద్యార్థినుల నృత్య ప్రదర్శన అలరించాయి.
మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొన్న క్రీడాకారులు 

విశాఖ అంటే సీఎంకు అమితమైన ప్రేమ
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విశాఖ అంటే సీఎం వైఎస్‌ జగన్‌కు అమితమైన ప్రేమ అన్నారు. సామాజిక శాస్త్రవేత్తగా, ఆర్థిక నిపుణుడిగా సీఎంను అభివర్ణించారు. చిత్తశుద్ధి, స్థిరచిత్తంతో ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే.. మరోవైపు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని సంకల్పించారన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.కన్నబాబు మాట్లాడుతూ.. పరిపాలనా రాజధాని విశాఖను అన్ని రంగాలతోపాటు క్రీడా రంగంలోనూ అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement