కిలాడీ మహిళ వెనుక జనసేన నాయకుడు? | Massive Gold Biscuit Scam in Tanuku | Sakshi
Sakshi News home page

కిలాడీ మహిళ వెనుక జనసేన నాయకుడు?

May 11 2026 9:09 AM | Updated on May 11 2026 9:09 AM

Massive Gold Biscuit Scam in Tanuku

తణుకు అర్బన్‌: తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు, నగదుకు ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తణుకు సజ్జాపురానికి చెందిన స్నేహలత, దుర్గాప్రసాద్‌ల వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. సుమారుగా రూ.25 కోట్లు దోచుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చని ఆశపడిన మహిళలు మోసపోయామని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. 

ఈ నెల 8వ తేదీన తణుకులో బాధిత మహిళలు తాము మోసపోయామంటూ మీడియా ముందు వాపోయారు. దీంతో  కిలాడీ జంట వ్యవహారం తణుకులో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరికొంతమంది బాధితులు బయటకువస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా కొందరు బంగారం దుకాణదారులను సైతం ఈ జంట మోసం చేసినట్లు తెలుస్తోంది. కిలాడీ జంటకు తాము చేసిన బ్యాంకు లావాదేవీలు, ఫోన్‌పేల ద్వారా పంపించిన నగదు వివరాలతోపాటు మాట్లాడిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని బాధితులు చెబుతున్నారు.  

తమ డబ్బు, బంగారం తీసుకుని కిలాడి జంట మోసం చేశారంటూ మీడియా ముందు బాధితులు వెల్లడించడంతో వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. తమపై కేసులు నమోదు చేయిస్తామని, సోషల్‌ మీడియా ద్వారా అల్లరి చేస్తామంటూ బెదిరిస్తున్నారని చెబుతున్నారు. తణుకుకు చెందిన ఒక జనసేన నాయకుడు వారి వెనుక ఉండి నడిపిస్తున్నారని, ఆయన ఇస్తున్న ధైర్యంతోనే మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలోనే పట్టణ పోలీసులను ఆశ్రయించామని.. అయితే న్యాయం జరగలేదని, తీరా తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వాపోతున్నారు. 

ఈ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం జరగదని స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపేస్తారని కిలాడి జంట అంటున్నారని ఆందోళన చెందుతున్నారు.డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో అప్పులు చేసి మరీ డబ్బు ఇచ్చి మోసపోయామని ఈ వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారులు విచారించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనతోపాటు నిరాహార దీక్షలకు దిగనున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తణుకు ఇన్‌చార్జి సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరా>వును వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని, శనివారం కూడా ఎవరూ స్టేషన్‌కు రాలేదని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement