నేటి సాయంత్రం నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా సీఎంఎస్–03 సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి మిషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) సమావేశాన్ని నిర్వహించారు.
అంటే రాకెట్‌ను అంతా సిద్ధం చేసి పరీక్షలు చేసిన అనంతరం ఎంఆర్‌ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (లాబ్) చైర్మన్ ఈఎస్ పద్మకుమార్ బృందానికి అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలో లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి శనివారం సాయంత్రం 3.26 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ప్రయోగాన్ని నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించారు.
అంటే 25.30 గంటల కౌంట్‌డౌన్ కొనసాగిన అనంతరం 4,400 కిలోల బరువు కలిగిన సీఎంఎస్–03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని మోసుకుని నింగివైపునకు దూసుకెళతుంది. ప్రయోగం ప్రారంభమైన అనంతరం 16.09 నిమిషాల్లో పూర్తిచేసి ఉపగ్రహాన్ని నిర్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెడతారు.
ప్రయోగం ఇలా..
43.5 మీటర్లు పొడవు కలిగిన ఎల్‌వీఎం–3 రాకెట్ ప్రయోగం ప్రారంభ సమయంలో 642 టన్నుల బరువుతో నింగికి పయనమవుతుంది. ఎల్‌ఎం3–ఎం5 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ సమయం ముగిసే సరికి రాకెట్‌కు రెండువైపులా వున్న ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్లు మండి 642 టన్నుల బరువు కలిగిన రాకెట్‌ను భూమి నుంచి నింగివైపునకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.
అంటే 400 టన్నుల ఘన ఇంధనాన్ని మండించి 105 సెకన్లలో మొదటి దశను పూర్తి చేస్తారు. 198.86 సెకన్లకు రాకెట్ శిఖరభాగాన అమర్చిన శాటిలైట్‌కు రెండు వైపులా వున్న షీట్ïÙల్డ్‌లు విడిపోతాయి. ఆ తరువాత ఎల్–110 దశతో అంటే 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని 106.94 సెకన్లకు మండించి 304.70 సెకన్లకు రెండోదశను పూర్తి చేస్తారు.
అనంతరం 25 టన్నుల క్రయోజనిక్ దశను 307.10 సెకన్లకు మండించి 950.54 సెకన్లకు మూడోదశను పూర్తి చేస్తారు. ఈ దశలోనే 965.94 సెకన్లకు (16.09 నిమిషాల్లో) సీఎంఎస్–03 ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టేందుకు అంతా సిద్ధం చేశారు.


