మద్యం దుకాణాలు కూడా పెరిగే అవకాశం
విమానాశ్రయాల్లో మద్యం దుకాణాల ఏర్పాటు దిశగా అడుగులు
మంత్రివర్గ ఉపసంఘం సూత్రప్రాయ నిర్ణయం
సాక్షి, అమరావతి: మద్యం ధరలు పెంపు దిశగా చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తద్వారా ఆదాయం భారీగా పెంచుకునేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. మద్యం ధరలు పెంచితే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎలా ఉంటాయనే విషయంపై కూడా చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వ మద్యం విధానంపై మంత్రి వర్గ ఉప సంఘం సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించింది. విమానాశ్రయాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజుల సవరణ, మద్యం దుకాణాల పునర్విభజన (మద్యం దుకాణాల సంఖ్య పెంచడం) దిశగా ఉప సంఘం చర్చించింది. అధిక శుద్ధి ఆల్కహాల్ తయారీకి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది. సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా, కమిషనర్ చామకూరి శ్రీధర్ పాల్గొన్నారు. మంత్రులు సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.


