
మధ్య తరగతి ఉద్యోగుల రాష్ట్ర సదస్సులో వక్తల డిమాండ్
కృష్ణలంక(విజయవాడతూర్పు): కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని మధ్య తరగతి ఉద్యోగుల రాష్ట్ర సదస్సు డిమాండ్ చేసింది. విజయవాడలో శనివారం ఈ సదస్సు జరిగింది. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, కనీస వేతనం రూ.26 వేలు, కనీస పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో రిక్రూట్‌మెంట్ చేపట్టాలని సదస్సు డిమాండ్ చేసింది.
జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ప్రైవేటీకరణ విధానాల రద్దుతో పాటు ఇతర డిమాండ్లతో ఈ నెల 20న దేశ వ్యాప్తంగా జరిగే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని సంఘం నేతలు పిలుపునిచ్చారు. సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
కార్పొరేట్‌కు వత్తాసు పలికేందుకే లేబర్ కోడ్..
మధ్యతరగతి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వినర్ ఆర్.అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ జరపకుండా కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేందుకు కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను దొడ్డిదారిన తీసుకుకొచి్చందన్నారు. లేబర్ కోడ్ అమల్లోకి వస్తే ఇప్పుడున్న అనేక హక్కులను కార్మికులు, ఉద్యోగులు, కోల్పోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్యాంక్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు వై.శ్రీనివాస్ మాట్లాడుతూ.. బ్యాంకుల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూ్యరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి జి.కిశోర్‌కుమార్, బెఫీ నాయకుడు ఎస్.వి.రమణ, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకుడు ఎల్.కృష్ణబాలాజీ, విద్యుత్ సంఘం రాష్ట్ర నాయకుడు ఎల్.రాజు, బ్యాంక్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకుడు నర్సింహం, బీమా ఉద్యోగ సంఘం నాయకుడు కళాధర్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు.