Kurnool: ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమా? | Kurnool Bus Incident | Sakshi
Sakshi News home page

Kurnool: ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమా?

Oct 26 2025 10:36 AM | Updated on Oct 26 2025 11:33 AM

Kurnool Bus Incident

కర్నూలు(సెంట్రల్‌): ఎగిసిపడుతున్న అగ్ని కీలలు.. మరో వైపు ప్రయాణికుల ఆర్తనాదాలు.. కళ్ల     ముందు భయానక వాతావరణం.. ఆ సమయంలో కొందరు వ్యక్తులు మృత్యువును సైతం ఎదిరించి కొందరి ప్రాణాలను కాపాడారు. కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రయాణికులను కాపాడేందుకు వాహనదారులు ఎంతో ధైర్యంగా సాహసం చేసి మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. బస్సులో కళ్లెదుటే మంటల్లో ఆహుతవుతున్నా ప్రయాణికులను కొందరు వాహనదారులు ప్రాణాలకు తెగించి కాపాడే ప్రయత్నం చేశారు. 

మంటల్లో దగ్ధమవుతున్న బస్సు డోర్లు, కిటికీలు, అద్దాలు పగలగొట్టి కొందరిని బయటకు లాగారు. ఫలితంగా 43 మంది ఉన్న కావేరి ట్రావెల్స్‌లో 24 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఎంత ప్రయతి్నంచినప్పటికీ 19 మందిని కాపాడలేకపోవడంతో అగ్నికి ఆహుతై బస్సులోనే ప్రాణాలను వదిలి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ప్రమాద సమయంలో హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ధర్మవరానికి చెందిన హరీష్‌ అనే వ్యక్తి సహాయక చర్యల్లో కీలకంగా వ్యవహరించాడు. 

అతడిని చూసి ప్రేరణ పొందిన మరికొంతమంది తమలో మానవత్వాన్ని నిద్రలేపి ముందుకొచ్చారు. ఈ క్రమంలో మంటలు ఉద్ధృతమవుతున్న సమయంలో బస్సు కిటికీలు, అద్దాలను బద్దలు కొట్టి ఐదుగురును బయటకు లాగినట్లు తెలుస్తోంది. అంతేకాక వెంటనే పోలీసులు, ఫైర్, 108 అంబులెన్స్‌లకు సమచారం ఇచ్చారు. అయితే అప్పటికే అంబుల్సెన్‌లు చేరుకోకపోవడంతో తమ సొంత వాహనాల్లో ప్రమాదం నుంచి బయట పడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరికొంత మందిని కాపాడే ప్రయత్నంలో ఉండగా ఒక్క ధాటిగా మంటలు ఎగిసిపడటంతో మిగతా వారిని కాపాడలేకపోయారు. కళ్ల ముందు కొందరు మంటల్లో ఆహుతి అవుతున్న వారిని చూసి బరువెక్కిన హృదయాలతో చలించిపోయారు.   

వెనక డోర్‌ను బద్దలు కొట్టి.. 
బస్సులోని వ్యక్తుల ప్రాణాలను కాపాడడంలో బస్సు రెండో డ్రైవరు, క్లీనరు కూడా కీలకంగా వ్యవహరించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణికులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వెనక డోర్‌ను బద్దలు కొట్టి దాదాపు 10 మంది దాకా బయటకు వెళ్లేలే చేశారని సమాచా రం. అప్పటికే కొంతమంది ప్రయాణికులు డోర్‌ను బద్దలు కొట్టేందుకు ప్రయతి్నస్తున్నా ఓపెన్‌ కాకపోవడంతో వారు పెద్ద రాడ్డు తీసుకొని బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు. వారు తమకేమి అనుకొని రన్నింగ్‌ డ్రైవర్‌ మాదిరిగా పారిపోయి ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగేది.  

కొందరు సోషల్‌ మీడియా కోసం తాపత్రయం... 
బస్సు ప్రమాద సమయంలో కొందరు మాత్రం తమలో మానవత్వం లేదనే విధంగా ఘటన స్థలంలో వ్యవహరించినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. కళ్లముందు మంటల్లో ప్రాణాలు కలిసి పోతుంటే కాపాడే ప్రయత్నం చేయకుండా సోషల్‌ మీడియా కోసం ఫొటోలు, వీడియోలు తీసి అప్‌లోడ్‌ చేస్తూ కనిపించారని చెప్పారు. ఆపదలో ఉన్న వారిని రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయతి్నంచి ఉంటే మరికొంతమంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేది. ఇప్పటికైనా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ప్రయతి్నంచాల్సిన అవసరం ఉంది.  

పత్తాలేని పెట్రోలింగ్‌ వాహనం.. 
44వ జాతీయ రహదారిలో ఎన్‌హెచ్‌ఏఐ(నేషనల్‌ హై అథారిటీ ఆఫ్‌ ఇండియా) రోడ్డు భద్రతను గాలికొదిలినట్లు తెలుస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే క్షణాల్లో అక్కడ ఉండాల్సిన పెట్రోలింగ్‌ వాహనం, అంబులెన్స్‌లు కనిపించలేదు. ఈ ప్రమాద ఘటనన జరిగిన ప్రదేశం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో పుల్లూరు టోల్‌ప్లాజా, 24 కిలోమీటర్ల పరిధిలో అమడగుంట్ల టోల్‌ ప్లాజాలు ఉన్నాయి. ఆయా టోల్‌ ప్లాజాల పరిధిలో పెట్రోలింగ్‌ వాహనాలు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉండాలి. అయితే ప్రమాద సంఘటనకు రెండు టోల్‌ ప్లాజాల నుంచి ఎలాంటి పెట్రోలింగ్‌ వాహనాలు రాలేదు. చివరికి అమడగుంట్ల టోల్‌ ప్లాజాకు సంబంధించి అంబులెన్స్‌ కూడా రాకపోవడంతో చిత్తూరు జాతీయ రహదారి 40కు చెందిన నన్నూరు టోల్‌ ప్లాజా అంబులెన్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి టోల్‌ ఫీజులను వసూలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఎన్‌హెచ్‌ఏఐ..రోడ్డులో వెళ్లే వాహనాలు, ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవడంలేదని తేటతెల్లమవుతోంది.  

ఎట్టా కాలిందో సూడు.. ఎంత నరకం చూశారో పాపం 

దగ్ధమైన బస్సును చూస్తూ వాహనదారుల దిగ్భ్రాంతి 

 ప్రమాదంతో జిల్లా ప్రజల్లో విషాదం  
వెల్దుర్తి: కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై బస్సు ప్రమాద ఘటన నుంచి జిల్లా ప్రజలు ఇంకా తేరుకోలేక పోతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున చావుకేకతో ఉలిక్కిపడిన జనం శనివారం కూడా అదే ప్రమాద విషయాన్ని చర్చించుకుంటూ కనిపించారు. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై విశ్లేషిస్తూ కనిపించారు. కాగా జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాద ఘటన స్థలంలో నిలిచి పక్కనే దగ్ధమైన బస్సును పరిశీలిస్తున్నారు. ‘అబ్బా ఎట్టా కాలిపోయిందో సూడు బస్సు.. ఈ బస్సే ఇట్టయిందంటే ఆ మంటలకు బస్సులో చచ్చిపోయిన్నోళ్లు ఎంత నరకం అనుభవించింటారో కదా’ అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కనిపించారు. జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న వివిధ రాష్ట్రాల ప్రయాణికులు, వాహనదారులు బస్సు దుర్ఘటను చూసి అయ్యో పాపం అంటూ వెళ్తున్నారు. బైక్‌ పడిన ప్రాంతం, చనిపోయిన బైకిస్ట్‌ గురించి, బస్సు ఈడ్చుకుంటూ వెళ్లిన ఆనవాళ్లు, పూర్తిగా దగ్ధమైన బస్సుపై వివిధ రకాలుగా వి చారు.‘ ఒక వ్యక్తి వల్ల ఇంత ఘోరం జరిగిందా? ప్రమాదానికి మద్యం కారణం’ అంటూ కొందరు ఘటనా స్థలంలో చర్చించుకుంటూ కనిపించారు. వెనుకాల వచ్చిన వాహనదారులు రోడ్డుపై పడిన బైక్‌ను పక్కకు తీసినా సరిపోయేదని.. ప్రైవేటు వాహనాల వేగాన్ని నియంత్రించాలని.. ప్రమాద సమయంలో వాహనదారులు ఇంకా స్పందించి ఉంటే బాగుండేది’ అని మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరో వైపు సంఘటన స్థలంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బైక్‌ పడిన ప్రాంతం నుంచి బస్సు దగ్ధమైన చోటు వరకు చోటు చేసుకున్న పరిణామాలపై వివరాలు సేకరిస్తూ కనిపించారు.

 ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమా? 
కొందరు ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించడం చాలా బాధాకరం. వారిలో మానవత్వం లేదు. మనిషి ప్రాణాలకు విలువ కనిపించలేదు. కళ్ల ముందే ప్రాణ భయంతో కాపాడండి అంటూ మహిళలు, పిల్లలు అరుపులు, కేకలు పెడుతున్నా పట్టించుకోకుండా వీడియోలు తీసుకొని సోషల్‌ మీడియాలో ప్రొజెక్టు చేసుకున్నారు. అయితే కొందరు మాత్రం వారిలో ఇంకా మానవత్వం చావలేదని నిరూపించారు. ప్రాణాలకు తెగించి కొందరిని కాలే బస్సు నుంచి బయటకు లాగారు. ధర్మవరానికి చెందిన హరీష్‌ అనే వ్యక్తి ఎంత మంచివాడంటే చెప్పలేం. అందరూ అతన్ని ఆదర్శంగా తీసుకొని సహాయక చర్యల్లో పాల్గొని కొందరిని ప్రాణాల నుంచి రక్షించారు.    – హైమారెడ్డి, హైదరాబాద్, ప్రమాద ఘటన ప్రత్యక్ష సాక్షి  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement