
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు 6.4618 టీఎంసీల నీళ్లు..
మాట ప్రకారం కుప్పానికి నీళ్లిచ్చిన వైఎస్సార్‌సీపీ సర్కార్
గతంలోనే కృష్ణా జలాలు పారించిన కాలువలో బాబు హడావుడి
కూటమి సర్కారు వచ్చాక కేవలం లైనింగ్ పనులే..
అది కూడా అంచనా పెంచేసి నాసిరకం పనులతో నిధుల దోపిడీ
రాళ్లపై నుంచి అప్పుడే ఊడిపోతున్న సిమెంట్
భూగర్భ పైప్‌లైన్ మార్గాల్లో నీటి లీకేజీ..
పలమనేరు, మదనపల్లె: తన సొంత నియోజక వర్గానికి కృష్ణా జలాలు తరలించానని నమ్మబలుకుతున్న సీఎం చంద్రబాబు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పటికీ అసలు కుప్పం ఉప కాలువ పనులే పూర్తి చేయించలేదు. 2014–19 టీడీపీ పాలనలో చుక్క నీరైనా కుప్పం సరిహద్దును తాకలేదు. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే కుప్పం ఉప కాలువ పనులకు మోక్షం కలిగింది. పనులు పూర్తి చేయించి కృష్ణా జలాలను కుప్పానికి తరలించిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది.
2024 ఫిబ్రవరి 26న నాటి సీఎం వైఎస్ జగన్ స్వయంగా కుప్పానికి కృష్ణా జలాలను విడుదల చేశారు. రామకుప్పం మండలంలోని మద్దికుంట, వెరశిచెరువు, శాంతిపురం మండలంలోని చిట్టివానికుంటలకు కృష్ణా జలాలను తరలించి నింపారు. 2021లో వి.కోట మండలం వరకు నీటిని తరలించగా 2024లో కుప్పం వరకు నీటిని పారించి ప్రజలకు అంకితం చేశారు.
ఉమ్మడి చిత్తూరుకు 6.4618 టీఎంసీల కృష్ణా జలాలు..
కుప్పానికి కృష్ణా జలాలను అందిస్తామని మాట ఇచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమేరకు హంద్రీ–నీవా కాలువ ద్వారా నీరందించి 91 చెరువులను సైతం నింపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు 6.4618 టీఎంసీల కృష్ణా జలాలను తరలించింది. శ్రీశైలం నుంచి అనంతపురం జిల్లాలోని జీడిపల్లె రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి సత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లె జలాశయానికి చేరిన కృష్ణా జలాలను పుంగనూరు ఉపకాలువ ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా దాహార్తి తీర్చారు.
పుంగనూరు, కుప్పం ఉపకాలువల నిర్మాణం, ఎత్తిపోతలు, భారీ మోటార్లు.. ఇవన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినవే. టీడీపీ హయాంలో ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేయగా.. వాటిని గత ప్రభుత్వం మరో కాంట్రాక్టు సంస్థకు అప్పగించి పనులు పూర్తి చేయించింది.
భూ సేకరణకు రూ.40 కోట్లు కేటాయించి 4.8 కి.మీ. పెండిగ్ కాలువ, 103 స్ట్రక్చర్స్ నిర్మాణాలు, 1,43,130 క్యూబిక్ మీటర్ల మట్టి పనులు, 22,933 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు నిర్మాణ పనులు, గుడిపల్లె మండలంలో రైల్వే క్రాసింగ్ సొరంగం పనులు 45 మీటర్లు మేర పూర్తి చేయించి నీటిని తరలించింది.వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వడివడిగా ఈ పనులన్నీ పూర్తి చేసి కుప్పానికి నీళ్లను అందించింది.
చెర్లోపల్లెలో నిల్వ చేసిన నీటిని వదులుతూ..
సిమెంట్ లైనింగ్ పేరిట నిధులు కొల్లగొట్టడం మినహా టీడీపీ కూటమి సర్కారు కుప్పానికి చేసిందేమీ లేదు. అంచనాలను అమాంతం పెంచేసి సీఎం రమేష్‌కు చెందిన కంపెనీకి లైనింగ్ పనులను అప్పగించింది. కుప్పం ఉపకాలువకు సంబంధించి బైరెడ్డిపల్లి మండలం తీర్థం నుంచి రామనపల్లి కాలువ మార్గంలో రాళ్లున్న చోట సిమెంట్ చల్లి వదిలేయడంతో అదంతా రాలిపోతోంది. ఇదే మార్గంలో బ్రిడ్జిలపై నిర్మించిన పైప్ లైన్లలో లీకేజీలు కనిపిస్తున్నాయి. తాతిరెడ్డిపల్లి వద్ద ఇంకా లైనింగ్ పనులు సాగుతున్నాయి.
ఓ వైపు కాలువలో నీరు ప్రవహిస్తుంటే ఈ పనులు ఎంత నాసిరకంగా జరుగుతున్నాయో ఊహించవచ్చు. వి.కోట మండలం పోతనపల్లి వద్ద అటవీ ప్రాంతంలో నీరు లీకవుతోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని చెర్లోపల్లి జలాశయ సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా ఆ నీటినే ఇప్పుడు కుప్పానికి వదులుతూ శ్రీశైలం నుంచి సీఎం చంద్రబాబు విడుదల చేసిన జలాలు వస్తున్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. గతేడాది అందాల్సిన నీటిని కాంక్రీట్ పనుల పేరుతో అడ్డుకుని వాటినే ప్రస్తుతం కుప్పం తరలిస్తున్నారు.