పోలీసులకు కుప్పం కోర్టు మొట్టికాయలు | Kuppam Judicial Magistrate Judge Granted Bail To YSRCP Pudi Srihari | Sakshi
Sakshi News home page

పోలీసులకు కుప్పం కోర్టు మొట్టికాయలు

Apr 17 2026 6:11 AM | Updated on Apr 17 2026 6:11 AM

Kuppam Judicial Magistrate Judge Granted Bail To YSRCP Pudi Srihari

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి రిమాండ్‌ తిరస్కరణ

సోషల్‌ మీడియా పోస్టులపై హైకోర్టు ఆదేశాలు పాటించాల్సిందే

పోలీసులు చెబుతున్నట్టు ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌గా చూడలేం

రూ.25 వేల బాండుతో సొంత పూచీకత్తుపై విడుదల

పారని పోలీసుల పాచికలు.. చెల్లని రెడ్‌బుక్‌ రాజ్యాంగం

33 గంటల నిర్బంధం తరువాత శ్రీహరి విడుదల

పూడి శ్రీహరిని బుధవారం అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనను జైలులో ఉంచాలనుకున్న పాచికలు పారలేదు. అక్రమ అరెస్టుపై పోలీసులను నిలదీసిన న్యాయస్థానం పూడి శ్రీహరికి సొంత పూచీకత్తుపై గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో 33 గంటల నిర్బంధం తరువాత గురువారం శ్రీహరి బయటకు వచ్చారు. పోలీసుల పైశాచికత్వం, చినబాబు రెడ్‌బుక్‌ రాజ్యాంగం న్యాయస్థానాల ఎదుట పనిచేయవని మరోమారు రుజువైంది. 

కుప్పం/కుప్పం రూరల్‌ : సోషల్‌ మీడియా పోస్టులకు సంబంధించి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్‌ చేయడంపై కుప్పం కోర్టు మొట్టికాయలు వేసింది. సోషల్‌ మీడియా కేసుల్లో అరెస్టులు సరికాదని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెబుతున్నా పోలీసులు తమ పద్ధతి మార్చుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టినందుకు రాప్తాడుకు చెందిన గిరీష్‌ను అరెస్టు చేసిన పోలీసులు, ఆయనతో బలవంతంగా వాంగ్మూలం పేరిట శ్రీహరిపై కేసు నమోదు చేశారు. దీనికితోడు శ్రీహరిపై బీఎన్‌ఎస్‌–111 సెక్షన్‌తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం తాడేపల్లిలో అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. 33 గంటల నిర్బంధం తరువాత శ్రీహరిని కోర్టులో ప్రవేశపెట్టారు.

సెక్షన్‌–111 ప్రకారం శ్రీహరి ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌కు పాల్పడ్డాడని, అతనికి రిమాండ్‌ విధిస్తే కస్టడీకు తీసుకుని విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే సెక్షన్‌–111 ఈ కేసులో వర్తించదని, కన్‌ఫెక్షన్‌ స్టేట్‌మెంట్‌ ప్రకారం శ్రీహరిపై అక్రమ కేసు పెట్టారని, రిమాండ్‌ ఇవ్వకూడదని శ్రీహరి తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గతంలో సోషల్‌ మీడియా పోస్టులపై హైకోర్టు తీర్పులను సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సెక్షన్‌–111 వర్తించదని స్పష్టం చేశారు. ఇతర సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్ష పడేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఇలాంటి ఘటనల్లో నోటీసులిచ్చి విచారించకుండా అరెస్ట్‌ చేయడం సరికాదన్నారు. సోషల్‌ మీడియా పోస్టులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను పోలీసులు పట్టించుకోవడం లేదని తప్పుపట్టారు. రూ.25 వేల రెండు బాండ్లతో సొంత పూచీకత్తుపై శ్రీహరిని విడుదల చేస్తున్నట్టు కుప్పం జూనియర్‌ సివిల్‌ జడ్జి, ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ వరుణ్‌తేజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

జర్నలిస్టులపై కేసులు దారుణం
సీనియర్‌ జర్నలిస్టులపై కేసులు దారుణమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం), సీనియర్‌ జర్నలిస్టు పూడి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్‌ మంజూరైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను 25 ఏళ్లుగా విలువలతో కూడిన జర్నలిజమే చేశానని చెప్పారు. ఏనాడూ తప్పు చేయలేదని, ఇప్పటికీ తనపై ఒక్క కేసు కూడా లేదని చెప్పారు. సీఎం చంద్రబాబుపై వ్యంగ్యంగా పోస్టులు పెట్టినట్టుగా కుప్పం పోలీసులు తనపై అభియోగాలు మోపుతూ కేసులు బనాయించారన్నారు. తనకు, ఆ పోస్టుకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

అది ఎక్కడ తయారైందో, ఎవరో షేర్‌ చేశారో తనకు తెలియదన్నారు. సీనియర్‌ న్యాయవాది, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు మఫ్టీలో వెళ్లి పూడి శ్రీహరి కారుకు వాహనాలు అడ్డంపెట్టి తీవ్రవాది తరహాలో ఆయనను కుప్పానికి తీసుకురావడం దుర్మార్గమన్నారు. చిత్తూరు ఎమ్మెల్సీ భరత్‌ మాట్లాడుతూ.. పూడి శ్రీహరికి బెయిల్‌ రావడంతో న్యాయం గెలిచిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ కుప్పం నియోజకవర్గ పరిశీలకుడు కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement