కర్నూలు జిల్లా: కోసిగి సంతమార్కెట్‌లో మంగళవారం గొర్రెలు, పొట్టేళ్ల క్రయ, విక్రయాలు భారీగా జరిగాయి. మండలంలోని అగసనూరు, దుద్ది, కొల్మాన్‌పేట, అగసనూరు, మూగలదొడ్డి, కందుకూరు గ్రామాలతో పాటు కౌతాళం మండలంలోని గోతుల దొడ్డిలతో పలు గ్రామాలు, ఆదోని మండలంలోని గణేకల్లు గ్రామాల్లో ఈనెలలోనే దేవర్లు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు దేవర్లకు పొట్టేళ్లను కొనుగోలు చేసేందుకు కోసిగి సంతకు చేరుకోవడంతో కిటకిటలాడింది.
ఈ క్రమంలో పొట్టేళ్ల ధరలు ఆకాశనంటుతున్నాయి. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్ణాటక ప్రాంతాల నుంచి అమ్మకానికి పొటేళ్లను తెచ్చారు. దాదాపు 2 వేల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 800 – 900 వరకు ప్రజలు కొనుగోళ్లు చేశారు. మిగతా పొటేళ్లను వ్యాపారులు బుధ, గురువారాల్లో సమీప ప్రాంతాల్లో జరిగే సంతకు తరలించనున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తెచ్చిన పోటీ పొట్టేలు ధర రూ.45వేలు పైగా పలికాయి.



