మార్కాపురం జిల్లా: ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కర్ణాటక డిపోకు చెందిన సిబ్బంది, ప్రయాణికులు దాడి చేశారు. అనంతరం ఏపీ డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టి, తమ బస్సులోకి నెట్టి..45 కిలోమీటర్ల పాటు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల ఎస్‌ఐ వెంకట రమణయ్య తెలిపిన వివరాలు..
రాత్రి వేళల్లో శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో ప్రయాణానికి అనుమతులు లేకపోవడంతో ఆదివారం ఉదయం 6 గంటలకు వాహనాలన్నీ నంద్యాల జిల్లా శిఖరేశ్వరం చెక్‌పోస్టు గేట్ వద్ద ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన విజయపురి ఆర్టీసీ బస్సు వరుసగా లైనులో ఉన్న బస్సులను వేగంగా దాటి చెక్‌పోస్టు గేటు వద్దకు వచ్చేసింది.
ఈ క్రమంలో అక్కడే ఉన్న పీలేరు డిపో డ్రైవర్ చాంద్‌బాషాకు, కర్ణాటక బస్సు సిబ్బంది మధ్య మాటామాటా పెరిగింది. దీంతో చాంద్‌బాషాపై కర్ణాటక ఆర్టీసీ సిబ్బంది దాడి చేసి అతడిని తమ బస్సులో వేసుకుని తీసుకెళ్లిపోయారు. ఇది చూసిన మరో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పెద్దదోర్నాలలోని గణపతి చెక్‌పోస్టు వద్ద కర్ణాటక బస్సును నిలిపేశారు. బస్సులో బందీగా ఉన్న చాంద్‌బాషాను విడిపించారు. కర్ణాటక ఆర్టీసీ సిబ్బంది, ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని వారిని శ్రీశైలం పోలీసులకు అప్పగించారు.


