
నెల్లూరు (సెంట్రల్): ఈనాడు రామోజీకి విషయ పరిజ్ఞానం లేదని, రాష్ట్ర బడ్జెట్‌కు, కేంద్ర బడ్జెట్‌కు తేడా కూడా తెలియని స్థితిలో ఉండడం సిగ్గుచేటని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. రామోజీ ముందు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల గురించి తెలుసుకోవాలని సూచించారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లాలని అభూత కల్పనలతో నీతిమాలిన రాతలు రాయడం పచ్చపత్రికలకు అలవాటైపోయిందని మండిపడ్డారు. చేతనైతే గత చంద్రబాబు ప్రభుత్వం పనితీరు, ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం తేడాలని విశ్లేషించే ధైర్యం ఉందా అని నిలదీశారు.
తెలుగుదేశం హయాంలో వ్యవసాయం ఎంత అధ్వానంగా ఉందో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. అర్హత ఉన్న ఒక్క రైతుకు కూడా రైతుభరోసా అందలేదని రాసే సాహసం రామోజీ చేయలేకపోయారని, దీన్నిబట్టి చూస్తే ఈనాడు కథనాలు అసత్యాలని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు.