కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అసహనం
ఇంధనం కొరతతో పనులు చేయలేకపోయామన్న అధికారులు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదంటూ నిలదీత
నిర్వాసితులకు పునరావాసం కల్పన, భూసేకరణ తీరుపై అసంతృప్తి
పనుల ప్రగతిపై రోజువారీ.. వారం వారం నివేదిక ఇవ్వాలని వ్యాప్కోస్‌కు ఆదేశం
సాక్షి, అమరావతి: జాతీయ ప్రాజెక్టు పోలవరం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 2024–25, 25–26లో నాలుగు విడతలుగా రూ.7,862.32 కోట్లు అడ్వాన్సుగా నిధులు ఇచ్చినా సరే.. ప్రాజెక్టు పనులతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పన, భూసేకరణ పనులు నత్తనడకేనా..? అంటూ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే 2026–27లో పోలవరానికి కేటాయించిన రూ.3,320.39 కోట్లను వినియోగించుకుని, నిర్దేశించిన లక్ష్యంలోగా ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
క్షేత్రస్థాయిలో పనుల ప్రగతిపై రోజు వారీ.. వారం వారం నివేదిక ఇవ్వాలంటూ వ్యాప్కోస్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌లో డీజిల్ కొరత తలెత్తిందని.. దీని వల్ల నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు చేయలేకపోయామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పనులను నెల రోజుల క్రితం క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా నిర్వాసితులకు పునరావాసం కల్పన.. భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జల్ శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు.
ఈ నేపథ్యంలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకూ పనుల ప్రగతిపై వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి కేఎల్ కాంతారావు శుక్రవారం సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో సీఎస్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ ప్రశాంతి, పీపీఏ సీఈవో సంజీవ్ వోహ్రా, సభ్య కార్యదర్శి రఘురాం, సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలియదా?
ఏప్రిల్‌లో నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు చేయకపోవడంపై అధికారులను కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి నిలదీశారు. పనులు చేయడానికి సరిపడా యంత్రాలు సమకూర్చుకోకపోతే ఎలా? అని ప్రశ్నించారు. దీనిపై ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి స్పందిస్తూ పోలవరంలో సరిపడా యంత్రాలు ఉన్నాయని.. ఏప్రిల్‌లో డీజిల్ కొరత తలెత్తిందని.. దీని వల్ల నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు చేయలేకపోయామని వివరించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా డీజిల్‌ను.. పనులు లక్ష్యం మేరకు చేయడానికి అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాలి కదా! అంటూ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.
నిర్వాసితులకు పునరావాసం కల్పన, భూసేకరణ తీరుపైనా అసహనం వ్యక్తం చేశారు. నాలుగు విడతలుగా అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను వినియోగించుకోలేదు..! ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులను ఎప్పుడు విడుదల చేయాలని అడుగుతారు? అని ప్రశ్నించారు. పోలవరం పనుల్లో నాణ్యతపై నెలలో కనీసం మూడు సార్లు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని సీఎస్‌ఎంఆర్‌ఎస్ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుపై అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత రాష్ట్రాలతో సమావేశం నిర్వహించి నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్‌కు సూచించారు.


