టీడీపీ అరాచకాలకు బలై ఊరు విడిచిన వారికి వైఎస్ జగన్ భరోసా
న్యాయ సాయం కోసం చర్యలు తీసుకోవాలని పార్టీ లీగల్ విభాగానికి ఆదేశం
జగన్‌ను కలిసిన మాజీ మంత్రి ముద్రగడ, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని వివరించిన పలువురు నాయకులు
టీడీపీ విధ్వంసం, దాడులపై బీబీసీలోనూ కథనం వచ్చిందని చర్చ
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టీడీపీ విధ్వంసాలు, అరాచకాలకు బలై ఊరొదిలి పక్క రాష్ట్రాల్లో ఉంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులకు అండగా నిలుస్తామని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యం చెప్పారు. త్వరలోనే తిరిగి స్వస్థలాలకు వచ్చి ఇళ్లలో ఉండేలా న్యాయ పరమైన చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని పార్టీ లీగల్ సెల్ నేతలను ఆదేశించారు.
శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు పార్టీ నేతలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వైఎస్ జగన్‌ను కలిసి వారి ప్రాంతాల్లోని పరిస్థితుల గురించి వివరించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి తదితరులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై వీరికి జగన్ దిశా నిర్దేశం చేశారు.
ఎన్నికల ఫలితాల అనంతరం పల్నాడు జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకున్న సంఘటనల గురించి కాసు మహే‹Ùరెడ్డి జగన్‌కు వివరించారు. టీడీపీ వరుస దాడులతో పలువురు నేతలు, అభిమానులు పక్క రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు వలస వెళ్లారని చెప్పారు. ఆయా ప్రాంతాలకు వలస వెళ్లిన వారి తరుఫున వచ్చిన ప్రతినిధులను జగన్‌కు పరిచయం చేస్తూ.. పరిస్థితిని వివరించారు.
వారందరి కష్టాలు విన్న జగన్.. పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులను పిలిపించి అక్కడికక్కడే పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఊరు విడిచి వలస వెళ్లిన వారంతా తిరిగి ఊళ్లకు వచ్చేలా న్యాయ పరంగా తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయాలని చెప్పారు. కాగా, టీడీపీ దాడులతో ఎంతో మంది ఊళ్లు వదిలారని బీబీసీలో వచ్చిన కథనం గురించి ఈ భేటీలో చర్చకు వచ్చి0ది.


