ఏపీలో ఎన్‌హెచ్‌ అభివృద్ధి నిధుల పెంపు

Increase in NH development funds in AP - Sakshi

రూ.1,408 కోట్ల నుంచి రూ.2,707.92 కోట్లకు పెంచిన జాతీయ రహదారుల శాఖ

ఏడు రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా మార్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం

ఇప్పటికే మూడు ఎన్‌హెచ్‌లకు నెంబర్లు కేటాయించి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

కేంద్ర రోడ్డు నిధి కింద రూ.441.90 కోట్లు అదనపు పరిపాలన అనుమతులకు రాష్ట్రం ప్రతిపాదనలు

సాక్షి, అమరావతి: జాతీయ రహదారుల (ఎన్‌హెచ్‌) అభివృద్ధి కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను పెంచుతూ జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. వార్షిక ప్రణాళిక కేటాయింపు కింద ఇస్తున్న రూ.1,408 కోట్ల నుంచి రూ.2,707.92 కోట్లకు పెంచుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఏపీలో ఎన్‌హెచ్‌ల అభివృద్ధి పరుగులు తీయనుంది. రాష్ట్ర రోడ్డులుగా ఉన్న పలు రోడ్లను హైవేలుగా మార్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

ఇప్పటికే 3 రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల నెంబర్లను కేటాయించి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. తెలంగాణ, ఏపీలను కలిపే విధంగా మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల మధ్య ఎన్‌హెచ్‌–67 జంక్షన్‌ వద్ద నాగర్‌ కర్నూల్, కోలాపూర్, రామాపూర్, మండుగల, శివాపురం, కరివెన, నంద్యాల వరకు (ఎన్‌హెచ్‌–40 సమీపంలో) ఉన్న 94 కి.మీ. రోడ్డును ‘ఎన్‌హెచ్‌–167కే’ గుర్తించింది. అనంతపురం జిల్లా పరిధిలోని ఎన్‌హెచ్‌–44పై కోడూరు నుంచి ముదిగుబ్బ (ఎన్‌హెచ్‌–42) వయా పుట్టపర్తి మీదుగా వెళ్లే 79 కి.మీ. రాష్ట్ర రహదారికి ఎన్‌హెచ్‌–342 కేటాయించారు. వైఎస్సార్‌ కడప జిల్లా పరిధిలోనూ రాయచోటి–వేంపల్లె–యర్రగుంట్ల–ప్రొద్దుటూరు–చాగలమర్రి వరకు ఉన్న 130.50 కి.మీ. రోడ్డును తాజాగా ఎన్‌హెచ్‌గా గుర్తించారు. దీనికి ఎన్‌హెచ్‌–440 నంబరు కేటాయించారు.  

గతం కంటే ఎక్కువగా నిధులు మంజూరు
రోడ్ల అభివృద్ధికి గతం కంటే ఈ ఏడాది కేంద్ర రోడ్డు నిధి కింద కేటాయింపులు పెరిగాయి. ఈ ఆర్ధిక ఏడాదిలో 616.36 కి.మీ. మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు 43 పనులకు గాను రూ.880.70 కోట్ల్లను కేటాయించారు. మరో 289.94 కి.మీ. రోడ్ల అభివృద్ధికి ఈ ఏడాదిలోనే రూ.441.90 కోట్లతో అదనపు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 2017–18లో 50.52 కి.మీ. రోడ్ల అభివృద్ధికి రూ.72.90 కోట్లే కేటాయించగా ఇప్పుడు రూ.880.70 కోట్లను కేటాయించడం గమనార్హం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top