కడప కోటిరెడ్డి సర్కిల్ /కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : వైఎస్సార్ కడప జిల్లా కేంద్రమైన కడపకు కూతవేటు దూరంలో గంజాయి బ్యాచ్ ఓ ఇంట్లోకి దూరి విచక్షణా రహితంగా దాడి చేసింది.. బాధితులు విలవిల్లాడిపోతూ రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నారనే విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి మరీ నట్టనడి ఆస్పత్రిలో కత్తులతో మరోమారు దాడికి దిగింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య పోరాడుతుండటం కలకలం రేపింది. సినిమాల్లో చూపినట్లు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ హత్య జరగడం పట్ల రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యమే హత్యకు కారణమని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాధితులకు రక్షణ కలి్పంచాల్సిన పోలీసులు వృత్తి ధర్మాన్ని గాలికొదిలేయడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికంగా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కడప నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో అలంఖాన్‌పల్లి ప్రాంతంలో శనివారం మారమ్మ తిరునాల జరిగింది. జాతరలో ఉన్న వెంకట దస్తగిరి అనే యువకుడిని వెంకటేష్ అండ్ బ్యాచ్ బెదిరించింది. భయపడిన వెంకట దస్తగిరి ఇంటికొచ్చి జరిగిన విషయాన్ని తండ్రి పెద్ద దస్తగిరికి చెప్పాడు. ఆయన వెంకటేష్ బ్యాచ్ సభ్యులను నిలదీశాడు. మరోసారి ఇలా చేయొద్దని హెచ్చరించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న వెంకటేష్ గ్యాంగ్ ఆ మరుసటి రోజు ఆదివారం సాయంత్రం వెంకట దస్తగిరిని మరోసారి బెదిరించింది. అంతటితో ఆగకుండా ఇంటి వద్దకు తరుముకుంటూ వెళ్లారు.
ఆపై ఏకంగా ఇంట్లోకి దూరి అడ్డొచ్చిన వారందరినీ దారుణంగా కొట్టారు. వీరి దాడిలో ఇంట్లో ఉన్న సిద్దయ్య, కుళ్లాయమ్మ, కె.దస్తగిరి గాయపడ్డారు. పెద్ద దస్తగిరి విషయం తెలుసుకుని హుటాహుటిన ఇంటికొచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. తేలిగ్గా తీసుకున్న పోలీసులు వారికి రక్షణ కలి్పంచకుండా నిర్లక్ష్యం చేశారు. హాస్పిటల్‌కు వెళ్లండంటూ ఉచిత సలహా ఇచ్చారు. చీకటి పడిందని.. ప్రత్యర్థుల వల్ల ముప్పు ఉందని, కనీసం ఆస్పత్రి వరకు భద్రత కలి్పంచాలని కోరినా వినిపించుకోలేదు. దీంతో చేసేదిలేక పెద్ద దస్తగిరి తన తమ్ముడు చిన్న దస్తగిరితో కలిసి గాయపడిన వారిని రిమ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
వెంటాడి.. వేటాడి హత్య
రిమ్స్ హాస్పిటల్‌లో గాయపడిన తన కుటుంబ సభ్యులకు ఎక్స్‌రే తీయించడం, తదితర పనుల్లో నిమగ్నమైన పెద్ద దస్తగిరి, చిన్న దస్తగిరిపై అర్ధరాత్రి తర్వాత (సోమవారం తెల్లవారుజామున) వెంకటేష్ బ్యాచ్ విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసింది. దీంతో పెద్ద దస్తగిరి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ చిన్న దస్తగిరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు ముందే స్పందించి ఉంటే నిండు ప్రాణం బలయ్యేది కాదు. పోలీసులు వారి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి ఉంటే ఈ హత్య జరిగి ఉండేదే కాదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దస్తగిరి ఫిర్యాదు చేసిన వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కనీసం ఒక రోజైనా పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచుకుని ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని ప్రజలు తప్పు పడుతున్నారు. కాగా, రిమ్స్‌లో దారుణ హత్యకు గురైన పెద్ద దస్తగిరి, తీవ్ర గాయాల పాలైన చిన్న దస్తగిరిని, నిందితులు దాడి చేసిన స్థలాన్ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌రెడ్డి, కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కడప తాలూకా స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కడప రిమ్స్ ఇన్‌ఛార్జి సీఐ ఓబులేసు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం
వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకుపోయిన పెద్ద దస్తగిరిపై గంజాయి మూకలు పక్కా ప్రణాళికతో అత్యంత కిరాతకంగా హత్య చేయడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర అన్నారు. బాధితులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. తమపై దాడి చేసిన వారు గంజాయి మత్తులో ఉన్నారని, వారు మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉందని బాధితులు పోలీసులకు చెప్పినా స్పందించక పోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. పెద్ద దస్తగిరి హత్యపై సిట్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కాగా, దస్తగిరి మృతదేహాన్ని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మేయర్ పాకా సురే‹Ùకుమార్, ఇతర నేతలు పరిశీలించారు. నిందితులకు అధికార టీడీపీ నేతల అండదండలు ఉండటం వల్లే పోలీసులు నిర్లక్ష్యం వహించారని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


