
కూటమి సర్కారుకు ఆటోవాలాల హెచ్చరిక
బెజవాడలో ఆటోలతో డ్రైవర్ల భారీ ర్యాలీ, ప్రదర్శన
గాందీనగర్(విజయవాడసెంట్రల్): మా జీవితాలతో ఆటలొద్దని, స్త్రీశక్తి పథకంతో రోడ్డున పడిన ఆటో, క్యాబ్ కార్మికులను ఆదుకోవాలని ఆటోవాలాలు గళమెత్తారు. కూటమి సర్కారు తీరుకు నిరసనగా మంగళవారం విజయవాడలో రణభేరి మోగించారు. సీఐటీయూ అనుబంధ యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆటోడ్రైవర్ల ఉద్యమ గర్జనతో బీఆర్టీఎస్ రోడ్డు మార్మోగింది.
సీతన్నపేట గేటు వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ శారదా కళాశాల జంక్షన్ వరకు.. అక్కడ నుంచి తిరిగి సీతన్నపేట గేట్ వరకు సాగింది. రెండు వరుసల్లో వందలాది ఆటోలు, వేలాది ఆటో కార్మికులు ప్రదర్శనలో పాల్గొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్త్రీ శక్తి పథకం వల్ల ఉపాధి కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటో,క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి రూ. 25,వేల ఆర్థిక సహాయం అందించాలని, జీవో నంబర్ 21 రద్దు చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఐదు శాతం వడ్డీతో ఆటోల కొనుగోలుకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రూ.4 లక్షల రుణాలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ రేట్లు తగ్గించాలని, సీఎన్‌జీ గ్యాస్ సబ్సిడీపై ఇవ్వాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు.
ఇప్పటికే కార్పొరేట్ యాప్‌లతో నష్టం
ఆందోళనకు మద్దతు తెలిపిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు మాట్లాడుతూ ఇప్పటికే ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల వల్ల ఆటో మోటార్ కార్మికులు కిరాయిలు తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల మరింత నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.