వికేంద్రీకరణతోనే సమన్యాయం  | Huge Rally In Ananthapur for AP Development decentralization | Sakshi
Sakshi News home page

వికేంద్రీకరణతోనే సమన్యాయం 

Dec 15 2021 5:45 AM | Updated on Dec 15 2021 7:18 AM

Huge Rally In Ananthapur for AP Development decentralization - Sakshi

అనంతపురంలో మేధావులు, ప్రజా సంఘాల నాయకుల ర్యాలీ

అనంతపురం కల్చరల్‌: పాలన, అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు సమన్యాయం దక్కుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్తులో మేధావుల చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం  ‘అధికార వికేంద్రీకరణ’పై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా యూపీఎస్సీ మాజీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణతోనే సాధ్యమన్నారు. ఏటా మూడు పంటలు పండే అమరావతి ప్రాంత భూములను నాశనంచేసి రాజధాని నిర్మించాలనుకోవడం శోచనీయమన్నారు.

గత ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కి.. అభివృద్ధిని ఒక ప్రాంతానికే పరిమితం చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. జేఎన్‌టీయూ (ఏ) రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ శశిధర్‌ మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి అమరావతి సరైన ప్రాంతం కాదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎస్కేయూ ప్రొఫెసర్‌ సదాశివరెడ్డి మాట్లాడుతూ..  శ్రీబాగ్‌ ఒడంబడిక అమలు కానందునే రాయసీమ వెనుకబాటుతనం వచ్చిందని, దాన్ని సరిజేయాలనుకుంటున్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అందరూ మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు.

సీనియర్‌ అడ్వకేట్‌ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భాగస్వామ్యం మరింత పెరిగేలా ఉద్యమం సాగాలన్నారు. రాయలసీమ డిక్లరేషన్‌ ఇచ్చి మళ్లీ అమరావతి గురించి మాట్లాడితే బీజేపీకి ప్రజల విశ్వాసం ఉండదన్నారు. పలువురు విద్యార్థులు కూడా అధికార వికేంద్రీకరణవల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మూడు రాజధానులకు మద్దతుగా అనంతపురంలో మేధావులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement