
ఎంటెక్ ప్రవేశాలపై విద్యార్థుల ఆందోళన
ఫీజు రీయింబర్స్‌మెంట్ జరగకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వని వైనం
దీనితో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వాయిదా వేసిన ఉన్నత విద్యా మండలి
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో ప్రవేశాలు తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వం మితిమీరిన నిర్లక్ష్యం కారణంగా ప్రవేశాల్లో జాప్యం కొనసాగుతోంది. తాజాగా పీజీఈసెట్ కౌన్సెలింగ్ తేదీలు మార్చడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎంటెక్ కౌన్సెలింగ్‌లో భాగంగా గేట్/జీపీఏటీ స్కోర్ ఆధారంగా, ఏపీ పీజీఈసెట్ ర్యాంకును అనుసరించి ప్రవేశాలకు చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో విడివిడిగా ఈనెల 8న నోటిఫికేషన్‌లు ఇచి్చంది. అయితే విద్యార్థులు రిజి్రస్టేషన్లు చేసుకుని, సర్టిఫికెట్లు అప్‌లోడ్‌కు వచ్చేసరికి దిక్కులు చూసే పరిస్థితి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బీటెక్ ఉత్తీర్ణత సాధించినా సర్టిఫికెట్లు లేకుండా ఎంటెక్ కౌన్సెలింగ్‌కు హాజరుకాలేని పరిస్థితి.
రూ.4200 కోట్ల బకాయిలు
కూటమి ప్రభుత్వం సుమారు ఆరు క్వార్టర్లకు సంబంధించి రూ.4,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టింది. ఈ క్రమంలో బీటెక్ పూర్తయిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు జారీని నిలిపివేశాయి. ఒక్క ప్రైవేటు విద్యా సంస్థల్లోనే కాదు.. ప్రభుత్వ వర్సిటీ కళాశాలలు సైతం ఇదే తీరులో వ్యవహరించాయి. విషయం ఉన్నత విద్యా మండలికి చేరడంతో గుట్టుచప్పుడు కాకుండా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అక్టోబర్ 11కు పొడిగించింది.
దీంతో విద్యార్థులకు తరగతుల ప్రారంభంలో మరింత జాప్యం జరిగే పరిస్థితి నెలకొంది. మరోవైపు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ఈ మెయిల్ ద్వారా ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కళాశాలల నుంచి సానుకూల స్పందన లేదు. కాగా, పీజీఈసెట్‌లో భాగంగా ఎంఫార్మసీ కౌన్సెలింగ్‌ను మినహాయించింది. ఫార్మసీ కౌన్సిల్ నుంచి అనుమతులు రాకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
పీజీ సెట్ కౌన్సెలింగ్‌లోనూ అనిశ్చితి
ప్రభుత్వం ఏపీ ఈఏపీసెట్, ఐసెట్, ఈసెట్ కౌన్సెలింగ్‌లోనూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యల నేపథ్యంలో డిగ్రీ విద్యార్థులకు సంబంధించి పీజీ సెట్ కౌన్సెలింగ్‌ను ప్రారంభించినా తీవ్ర అనిశ్చితి తప్పదని భావిస్తున్నారు.