
లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కూడా హెడ్‌లెస్‌గా ఉన్నాయి
ఈ పోస్టుల భర్తీకి మీకొచ్చిన ఇబ్బంది ఏంటి?
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
గడువులోపు ఈ పోస్టులను భర్తీ చేయాల్సిందే
ఈఆర్‌సీ చైర్మన్ పోస్టును ఎప్పటిలోపు భర్తీచేస్తారో చెప్పండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. విచారణ 24కి వాయిదా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి పూర్తిస్థాయి చైర్మన్‌ను నియమించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) వంటి సంస్థలకు అధిపతులు లేకుండా (హెడ్‌లెస్) ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ పోస్టులను భర్తీచేయడానికి వచ్చిన ఇబ్బందేమిటని నిలదీసింది. నిర్దిష్ట గడువులోపు ఈఆర్‌సీ చైర్మన్ నియామకాన్ని పూర్తిచేయాలని ఆదేశించింది.
లేనిపక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈఆర్‌సీ చైర్మన్ పోస్టును ఎప్పటిలోగా భర్తీచేస్తారో స్పష్టంగా చెప్పాలంది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న ఏపీఈఆర్‌సీ చైర్మన్ పోస్టును భర్తీచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ డాక్టర్ దొంతి నరసింహారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈఆర్‌సీ చైర్మన్ పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉందని తెలిపారు. సభ్యుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ.. సభ్యుడే ఇన్‌చార్జి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఓ సభ్యుడి నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్ల సమావేశంలో బిజీగా ఉండటంతో పూర్తి వివరాలు తెప్పించుకోలేకపోయినట్లు చెప్పారు. దీంతో ధర్మాసనం గడువులోపు ఈ ఖాళీలను భర్తీచేయాల్సిందేనని తేల్చిచెప్పింది. ఎప్పటిలోపు భర్తీచేస్తారో స్పష్టంగా చెప్పాలంటూ విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.