చిగురుటాకులా వణికిన తీరం 

Heavy Rain in Krishna district  - Sakshi

పెనుగంచిప్రోలు వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మున్నేరు.

వత్సవాయి మండలం పాత వేమవరం లో నీట మునిగిన వరి పొలాలు.

లింగాల వద్ద బ్రిడ్జి పై ప్రవహిస్తున్న వరద నీరు.

ఖమ్మం జిల్లాకు ఆగిపోయిన వాహనాల రాకపోకలు.

జిల్లాలోని 10,221 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు  

సాక్షి, విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం కృష్ణాజిల్లాను కుదిపేసింది. వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జడి వాన ఇంక వదల్లేదు. పంట పొలాలు నీటమునిగాయి. వరి పంట కొన్ని ప్రాంతాల్లో నెలకొరిగింది. పత్తి నీటిలో మునిగింది. కూరగాయల పొలాలు దెబ్బతిన్నాయి. చాలా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ నగరంలో కొన్ని కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. జిల్లా కలెక్టర్‌ వివిధ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి సమీక్షించారు. స్థానిక అధికారులు ఎక్కడిక్కడ సహాయ చర్యలు చేపట్టారు.  4331 హెక్టార్లలో పత్తి, 4284 హెక్టార్ల వరి, 866 హెక్టార్ల మొక్కజొన్న, 740 ఎకరాల మినుము, అరటి, తోటకూర పంటలకు నష్టం వాటిల్లింది.

నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
ఇక విజయవాడ దుర్గ ఘాట్‌లో కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. విద్యాధరపురంలో కొండ చరియలు పడి ఇల్లు ధ్వంసంకాగా, ఒకరు మృతి  చెందారు. అలాగే నగరంలోని నదీతీర ప్రాంతంలో ఉన్న కృష్ణలంక సమీపంలోని తారకరామ నగర్ కాలనీ, రాణిగారి తోట, భూపేష్ గుప్తా నగర్, రామలింగేశ్వర నగర్ తదితర కాలనీలు మునిగిపోయాయి. నదిలోకి ఒక్కసారిగా ఎగువ నుంచి వరద నీరు చేరడం... ప్రస్తుతం ఆరు లక్షలకి పైగా క్యూసెక్కుల నీరు క్రిందకి వదలడంతో ఈ కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. దాదాపుగా అయిదారు అడుగుల పైనే నీరు ప్రవహిస్తోంది. తారకరామ నగర్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తమ ఇళ్లలో విలువైన సామాన్లు, వంట సామాగ్రి తీసుకుని పునరావాస కేంద్రాలకి బయలుదేరారు. నదీ తీరప్రాంతంలో రక్షణ గోడ పూర్తి చేయడం ద్వారానే తమకి‌ ముంపు బెడద తొలుగుతుందంటున్నారు. 

రెండో ప్రమాద హెచ్చరిక జారీ
కృష్ణానదికి ఎగువ నుంచి పెరుగుతున్న వరద  ఉధృతి నేపధ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ కి దాదాపుగా 6 లక్షల వరకు ఇన్ ఫ్లోస్ వచ్చి చేరుతుండటంతో 70 గేట్లని ఎత్తి ఆరు లక్షల క్యూసెక్కులని‌క్రిందకి వదులుతున్నారు. శ్రీశైలం నాగార్జున సాగర్... పులిచింతల నుంచి వరద నీటిని వదలడంతో సాయంత్రానికి ప్రకాశం బ్యారెజ్ వద్ద ఇన్ ఫ్లో ఏడు లక్షల‌ క్యూసెక్కులకి చేరుకుంటుందని భావిస్తున్నారు. మరోవైపు కృష్ణా నదికి వదర నీరు పోటెత్తడంతో కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ అధికారులని అప్రమత్తం చేశారు. విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాలు ముంపుబారిన పడటంతో ప్రజలని‌ పునరావాస కేంద్రాలకి తరలించారు. 

చదవండి: తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన వాన

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top